రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ)/ వేములవాడ: సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థ సోలార్ పవర్లోకి ప్రవేశించి మరో రికార్డు సృష్టించబోతున్నది. 1969లో జిల్లాలోని 13 మండలాల్లోని అన్ని గ్రామాలకు ఒకేసారి వంద శాతం విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చిన ఏకైక సహకార విద్యుత్తు సంస్థగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన విషయం తెల్సిందే. తాజాగా సెస్‌ను సొంతంగా సౌర విద్యుదుత్పత్తిలోకి తీసుకొచ్చేందుకు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం జర్మనీ సంస్థ ప్రతినిధులతో తరచూ సమావేశమవుతున్నారు. అందులో భాగంగా గత నెల 27న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును హైదరాబాద్‌లో కలిసి చర్చలు జరిపారు. సోలార్ విద్యుత్తు ఉత్పత్తితో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతోపాటు సెస్ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు పడే అవకాశం ఉన్నది. ఇందుకోసం అధికారులు సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నారు. ఆగస్టు నెలలో హైదరాబాద్‌కు రానున్న జర్మనీ బృందంతో సెస్, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు.