కాజీపేట, జూన్ 6 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ను అణచివేయాలని చూస్తున్నాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన్‌రావు తనయుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్ స్పష్టంచేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా జరిగిన ఆందోళనలో నమోదైన కేసులలో ప్రశాంత్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను శుక్రవారం కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఎల్కతుర్తిలో ఏప్రిల్ 27న జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు భూపాలపల్లి నుంచి వస్తున్న వాహనాలను ఉప్పల్ రైల్వేస్టేషన్ సమీపంలో దారి మళ్లించడంతో పది కిలోమీటర్ల పొడవునా వేలాది వాహనాలు నిలిచిపోయాయని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ రైల్వే గేట్ వద్ద ఆందోళన చేపట్టగా ఆర్పీఎఫ్ పోలీస్‌లు అక్రమంగా కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.