వరంగల్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే ‘స్కామ్‌లు ఫుల్.. స్కీమ్‌లు నిల్’ అని విమర్శించారు. శుక్రవారం బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సర్కార్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల వేట చేస్తున్నదని.. లగచర్ల, కంచ గచ్చిబౌలి, హైడ్రాతో ఆ పార్టీ చేస్తున్న అరాచకాలు ప్రజలకు తెలిసిపోయాయని పేర్కొన్నారు.
ఉద్యమ సమయంలో నిర్వహించిన వరంగల్ సింహగర్జన దేశంలోనే పెద్ద సభ అని ఆ కార్యక్రమానికి వచ్చిన మాజీ ప్రధాని దేవగౌడ ప్రశంసించారని గుర్తుచేశారు. రజతోత్సవ మహాసభ కూడా చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టంచేశారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షం: ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కాంగ్రెస్ 16 నెలల పాలనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, కేసీఆర్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని భావిస్తున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తున్నారని, బీఆర్ఎస్పై ప్రజల్లో ఉన్న ఆదరణకు ఇదే నిదర్శనమని చెప్పారు. ఎల్కతుర్తిలో నిర్వహించనున్న మహాసభ నిర్వహణపై ఎప్పటికప్పుడు కేసీఆర్, కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు.
తెలంగాణ ప్రజల 60 ఏండ్ల ఆకాంక్షను సాకారం చేసి, కొత్త రాష్ర్టాన్ని సుభిక్షంగా మార్చిన మహనీయుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. గాంధీ మార్గం లో ఉద్యమం నడిపించి.. అంబేదర్, ఫూలే ఆలోచనా విధానంలో పేదలకు విద్య, వైద్యా న్ని అందించారని చెప్పారు. రజతోత్సవ సభ కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, వొడితల సతీశ్‌బాబు, మాజీ చైర్మన్లు సమ్మారావు, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.