హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ చేసిన పాపం రైతన్నలకు శాపంగా మారిందని శాసనమండలిలో విపక్షనేత సిరికొండ మధుసూధనాచారి విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ సభ్యులు బుధవారం వరికంకులతో నిరసన తెలిపారు. ఎండిన వరి.. రైతుకు కాం గ్రెస్ పెట్టిన ఉరి అంటూ నినాదాలు చేశారు. నీళ్లు ఉండి కూడా పొలాలు ఎండబెడుతారా? అని నిలదీశారు. బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
పోలీసుల తీరుపైనా సభ్యులు అభ్యంతరం తెలిపారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి ఎండిపోయిందని చెప్పారు. పదే్ంల పాటు బీఆర్ఎస్ పాలనలో చెరువులు నింపిన కేసీఆర్ రైతులకు స్వర్ణయుగం తెచ్చారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనలో పంటలకు గిట్టుబాటు ధర లేదని, రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతాంగానికి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఎండలతోనే పంటలు ఎండుతున్నాయ నడం సిగ్గుచేటు : ఎమ్మెల్సీ కవిత
ఎండల వల్లే రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. నిరుడు వర్షాలు సమృద్ధిగా పండాయని, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి నిర్వహణ తెలియకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల ఆయకట్టు కింద ఉన్న పొలాలు కూడా ఎండిపోతున్నాయని ధ్వజమెత్తారు. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కృష్ణా నది నుంచి 10 వేల క్యూసెకుల నీళ్లు ఎత్తుకుపోతుంటే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చూస్తూఊరుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్లు ద్వారా నీటి సరఫరా పెరిగిందని చెప్పారు. కేసీఆర్ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారని, ఆయన మీద కోపంతో ఆ నీళ్లు వాడుకోకపోవడం సరైనది హితవు పలికారు. ఇప్పటికైనా ఉన్న నీటి వనరులను సక్రమంగా వాడుకొని రైతులకు నీళ్లు ఇవ్వాలని సూచించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టంచేశారు. సమావేసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సురభి వాణిదేవి, షేరి సుభాష్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ఎల్.రమణ, తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.