కాచిగూడ, మే 26 : ప్రజాస్వామ్యానికి బీసీలే పునాదిరాళ్లు అని, అలాంటి బీసీలు ఎదుగకుండా కొంతమంది అగ్రవర్ణాలు కుట్ర పన్నుతున్నారని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్‌యాదవ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కాచిగూడలోని ఓ హోటల్లో బీసీ, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మధుసూదనాచారి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో తీసుకొచ్చిన జీవో-7తో రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.10వేల కోట్లకు పైగా పెండింగ్ పెట్టిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై మొదటి నుంచి సవతితల్లి ప్రేమ చూపిస్తున్ననదని, నిధుల విడుదలకు మొండికేస్తున్నదని మండిపడ్డారు. వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులపై నాన్చుడు ధోరణి విడనాడి, సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయకుండా లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ధ్వజమెత్తారు. సమావేశంలో కుల్కచర్ల శ్రీనివాస్, గణేశ్‌చారి, విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ, శేఖర్, జస్వంత్‌కుమార్, చంద్రశేఖర్, మల్లయ్య, జగన్నాథం, వరుణ్, నరసింహ, తారకేశ్వరి, సమత, సంధ్యారాణి, స్వర్ణ, చందు, సత్యంరాజ్, సుజాత, గౌతమి, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.