హనుమకొండ, ఫిబ్రవరి 13 : అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని చిత్తశుద్ధితో పాలించడం లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. గురువారం ఆయన హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కాస్కో.. కేసీఆర్ మౌనం మాజీ సీఎంలు వైఎస్సార్, చంద్రబాబుకు తెలుసని అన్నారు.
రేవంత్ పాలనను గమనిస్తున్న కేసీఆర్ మౌనం వీడి త్వరలోనే ప్రజల్లోకి రాబోతున్నట్టు స్పష్టం చేశారు. ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేందని విమర్శించారు. బీసీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసింది బీఆర్ఎస్ సర్కారు అని తెలిపారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని మండిపడ్డారు. బ్రిటిష్ కాలంలోనే కులగణన, బీసీ గణన చేశారని, 75- 80 ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను రెండో శ్రేణి ప్రజలుగానే చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటర్ల లిస్టులో 3.35 కోట్లు, మరో లక్ష మంది ఓటు హక్కులేని వారు కలుపుకొని 4.35 కోట్లకు పైగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో బీసీలను 3.75 కోట్లుగా మాత్రమే చూపిందని దుయ్యబట్టారు. లెకలు తప్పుగా చూపడంతో బీసీలకు కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాల్లో కోత పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. బీసీల అభ్యున్నతి, రాజకీయ ప్రాతినిధ్యంపై తనతోపాటు దాస్యం వినయ్‌భాస్కర్, మరికొందరం కలిసి తమిళనాడు వెళ్లి అక్కడి విధానాన్ని అధ్యయనం చేసినట్టు తెలిపారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ ఫిర్యాదుతో అక్కడి స్టాలిన్ ప్రభుత్వం తమకు సహకరించలేదని అన్నారు. అయినా అకడే రెండు రోజులు ఉండి పెరియార్ రామస్వామి ఆఫీసులో సమాచారం సేకరించినట్టు తెలిపారు. అకడి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో, ఉద్యోగాల్లో 62 శాతం బీసీలకు కేటాయిస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ధాటికి సీఎం రేవంత్‌రెడ్డి చిగురుటాకులా వణికిపోవడం ఖాయమని హెచ్చరించారు. పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పోరాటంతోనే ప్రభుత్వం బీసీ కులగణన రీ సర్వేకు అంగీకరించిందని దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీ కుల గణన చేసి 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్‌గాంధీ చట్టబద్ధత లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.