చేర్యాల, నవంబర్ 8: సీఎం రేవంత్రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం విధ్వంసమవుతున్నదని, బాధ్యయుతంగా ఉండాల్సిన మంత్రు లే ఆటంబాంబులు పేలుతాయని మాట్లాడ టం సిగ్గుచేటని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. సీఎంతోపాటు మంత్రులు సైతం సోయిలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం పదవి ఒక పవిత్రమైనదని, ప్రజలకు సేవ చేసేందుకు దానిని ఉపయోగించుకోవాలని కానీ.. రేవంత్రెడ్డి దిగజారుడు భాష ప్రయోగిస్తుండటం తో ప్రజలు సిగ్గుపడుతున్నారని పేర్కొన్నారు.
తామేం తక్కువ కాదన్నట్టుగా మంత్రి పొంగులేటి విదేశాల్లో ఉన్నపుడు బాంబులు పేలుతాయని, తాజాగా ఆటంబాంబు పేలబోతుందని ప్రకటనలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో సంపద పెంచి పథకాల రూపంలో అన్ని వర్గాల ప్రజలకు పంచిపెట్టారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అటకెక్కించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న విషయాన్ని మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు గమనిస్తున్నట్టు తెలిపారు. రైతుభరోసా, మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ముందుగా ప్రజలకు ఇచ్చిన హా మీలను నేరవేర్చాలని సూచించారు. అంతకుముందు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.