హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ‘ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున బీసీలకు ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఇస్తాం. సబ్‌ప్లాన్ అమలు చేస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ ఆచరణలో మోసం చేస్తున్నది. తాజా బడ్జెట్లోనూ దగా చేసింది. బడ్జెట్ అంకెలే అందుకు నిదర్శనం’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ధ్వజమెత్తారు. మంగళవారం మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం కోటా ఇస్తామని విస్మరించిందని దుయ్యబట్టారు. సబ్‌ప్లాన్ ఊసేలేదని, ఏటా రూ.20 కోట్ల మాటేలేదని ఎత్తిచూపారు. ‘2024-25 బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.9,606 కోట్లు కేటాయించి, రూ.6,211 కోట్లను విడుదల చేసి, కేవలం రూ.1,932 కోట్లే ఖర్చు చేసిందని విమర్శించారు. 2025-26లో రూ.11,607 కోట్లు కేటాయించి, రూ.7,214 కోట్లు విడుదల చేసి ఇప్పటి వరకు ఖర్చు చేసింది కేవలం రూ.3వేల కోట్లేనని ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బలహీనవర్గాల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
శాసనమండలి మీ జేబుసంస్థా?
‘ప్రజల తరఫున ప్రశ్నిస్తుంటే మా సభ్యుల గొంతులు నొకేస్తరా? ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు కనీసం సమాధానాలు కూడా ఇవ్వడం లేదు. సభ నడుపడం ఇలాగేనా? శాసనమండలి ఏమైనా మీ జేబు సంస్థా? ఈ బడ్జెట్ సమావేశాలు కేవలం ప్రచారానికే తప్ప, సామాన్యుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు’ శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కాంగ్రెస్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇష్టారాజ్యంగా సభ నడుపుతున్నారని, మండలిని అవమానపరిచేలా సర్కార్ తీరు ఉన్నదని, ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ సభ్యులతో కలిసి బయటకు వెళ్లారు. అనంతరం శాసనమండలి మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ చర్చపై సర్కార్ దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. నియమ, నిబంధనలు పట్టించుకోకుండా గంటలపాటు సభను వాయిదా వేసుకుంటూ కాలం గడిపారని ఆరోపించారు. జీరోఅవర్ నడుపాల్సిందిగా తాము కోరినా పట్టించుకోలేదని తెలిపారు. సభను పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా నడుపుతున్నారని విమర్శించారు. శాసనమండలి నాలుగు గంటలపాటు వాయిదా వేశారని, ప్రజల సమస్యలు పరిషరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని తెలిపారు.
బీఆర్ఎస్ నిరసన
బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సరైనా సమాధానాలు ఇవ్వలేదని ఆరోపిస్తూ శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. తమ సీట్లలో నుంచి లేచి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. బీసీలకు ఆశలు చూపిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక దగా చేసిందని విమర్శలు గుప్పించారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడింది: దాసోజు
శాసనమండలి నిర్వహణ తీరు నిరాశా నిస్పృహలకు గురిచేసిందని దాసోజు శ్రవణ్‌కుమార్ చెప్పారు. బడ్జెట్ సమావేశాలు అంటే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు ఒక నమ్మకం ఉంటుందని, కానీ ఈ సభలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడిందని తెలిపారు. గంటలపాటు వాయిదా వేస్తూ సభను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్ సమాధానం రోజు సీఎం ఢిల్లీ నుంచి వచ్చే వరకు సభను వాయిదా వేశారని తెలిపారు. మండలిలో సమావేశాలకు మంత్రులు కూడా సరిగా రావడం లేదని తెలిపారు. ప్రజా సమస్యలు చర్చించకపోతే ఈ సభలు ఎందుకు? అని ప్రశ్నించారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. చర్చకు తావివ్వండి’ అని హితవు పలికారు.
సబ్‌ప్లాన్ అమలు చేస్తారా? లేదా?: బండా ప్రకాశ్
బీసీలకు ఇచ్చిన హామీ మేరకు బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తారా? లేదా? అని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ప్రశ్నించారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశలు చూపి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. బీసీ కులగణనపై వేసిన బూసాని కమిషన్ నివేదికను సభ ముందు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రపతికి సమర్పించిన బీసీ బిల్లుల పురోగతి ఎక్కడిదాకా వచ్చిందని నిలదీశారు.
కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం: ఎల్ రమణ
బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ఊసెత్తకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల్లోనూ తగిన ప్రాతినిధ్యం ఇవ్వలేదని ఆరోపించారు. జనాభాకు అనుగుణంగా నిధులిస్తామని మోసం చేసిందని మండిపడ్డారు. సబ్‌ప్లాన్ ద్వారానే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
పేదల సంక్షేమాన్ని మరిచిన బడ్జెట్ ; బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
కాంగ్రెస్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజల ఆకాంక్షలు, పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే ఎన్నికల హామీలు నెరవేర్చాలనే ఆలోచన చేసినట్టు కనిపించలేదని పేర్కొన్నారు. ‘గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారాని కి వీలుగా బడ్జెట్ కేటాయింపులు లేవు. ప్రాధాన్యతా రంగాలకు సరైన కేటాయింపులు చేయలే. నిరుద్యోగ భృతి, ఫించన్ల పెంపు, రైతుకూలీలు, కౌలు రైతులను ఆదుకునే అంశాలకు ప్రాధాన్యమివ్వలేదు. బడ్జెట్ రాష్ర్టాన్ని తిరోగమనం దిశగా తీసుకెళ్లేలా ఉంది’ అని కోటిరెడ్డి ఆరోపించారు.