హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రైతుల ధాన్యాన్ని నకిలీ ట్రక్‌షీట్లతో విక్రయించి రూ. 91 లక్షలు కాజేసిన ఘటన సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అదే జిల్లాలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు వెళ్లిన మూడు లారీల ట్రక్షీట్లు 10 రోజులైనా తిరిగి రాలేదు. దీంతో ఆ లారీలు మిల్లుకే వెళ్లాయా..? లేక దొంగదారి పట్టాయా..? అనే అనుమానాలు వస్తున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో రేబర్తి పీఏసీఎస్ కేంద్రం నుంచి వెళ్లిన 4 లారీల ధాన్యం ట్రక్షీట్లు 12 రోజులైనా తిరిగి రాలేదు. ఆ ధాన్యం శివసాయి బాలాజీ రైస్ మిల్లులో ఉందని చెప్తున్నా.. అందుకు రసీదు లేదు. ఇప్పటివరకు రైతులకు ఓటీపీ రాలేదు. దీంతో సిరిసిల్లలో మాదిరిగానే తమ ధాన్యం ఉన్నదో లేదంటే దొంగదారి పట్టిందోనని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్టు తెలిసింది. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యం ఎక్కడికి వెళ్తున్నదో, ఏమైపోతున్నదో తెలియని పరిస్థితి నెలకొన్నది. ధాన్యం వెళ్లిన 10-15 రోజులకు కూడా ట్రక్షీట్లు రైతులకు అందడంలేదు. దీంతో రైతుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది. తమ ధాన్యం మిల్లులకు చేరిందా? లేదా?, తమ ధాన్యం దించుకోవడానికి అధికారులు, మిల్లర్లు అంగీకరించారా లేదా ఏమైనా కొర్రీలు పెట్టారా అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
అధిక ధాన్యం వచ్చిందనే సాకుతో సరుకు తరలింపులో, మిల్లులపై సివిల్ సప్లయ్ అధికారులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు అనుకూలంగా ఉండే మిల్లులకు ఎక్కువ ధాన్యం కేటాయించడం, వ్యతిరేకంగా ఉండే మిల్లులకు తక్కువ ధాన్యం కేటాయించడం పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. తీరా అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్లతో కుమ్మక్కు వ్యవహారంతో చివరికి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విమర్శలున్నాయి.
సిరిసిల్ల ఘటన తర్వాత సిద్దిపేట జిల్లా రేబర్తి పీఏసీఎస్ నుంచి వెళ్లిన నాలుగు లారీల ధాన్యం సేఫ్‌గా ఉందా..? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం తరలించి 12 రోజులవుతున్నా ఇప్పటికీ ఆ రైతులకు ట్రక్‌షీట్ రాలేదు, ఓటీపీ కూడా రాలేదు. దీంతో తమ ధాన్యం భద్రంగానే ఉందా అన్న ఆందోళన సదరు రైతుల్లో వ్యక్తమవుతున్నది. రేబర్తి పీఏసీఎస్ నుంచి సుమారు 25 లారీల వరకు ధాన్యం తరలించగా ఇందులో 8 లారీలకు సంబంధించి.. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. వీటిలో నాలుగు లారీల రైతులకు 20 రోజులు గడుస్తున్నా నేటికీ వడ్ల పైసలు రాలేదు. ఇక మరో నాలుగు లారీల రైతుల పరిస్థితి మరీ దారుణం. ధాన్యం తరలించి 12 రోజులవుతున్నా నేటికీ అందుకు సంబంధించి ధ్రువీకరణ చేయలేదు.
రైతులకు ట్రక్‌షీట్ ఇవ్వలేదు, ఓటీపీ రాలేదు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు మిల్లుకు తరలించామని, అక్కడి నుంచి ట్రక్‌షీట్ రావడంలేదని సమాధానం వస్తున్నట్టు తెలిసింది. ఆ ధాన్యం ఏ మిల్లుకు వెళ్లిందో, అసలు మిల్లుకు వెళ్లిందో కూడా తెలియదు. దీంతో తమ ధాన్యం ఏమైందో అనే ఆందోళన సదరు రైతుల్లో నెలకొన్నది. సాధారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా పెట్టి లారీల్లో ఎక్కించి మిల్లుకు తరలించిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో ట్రక్‌షీట్ జారీ చేయాలి. ఆ తర్వాత ఒక రోజుకు రైతులకు ఓటీపీ వస్తుంది, మరో రెండు మూడు రోజులకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. ఇక్కడ పూర్తి విరుద్ధంగా కొంతమంది రైతులకు ఓటీపీనే రాలేదు, ఇంకొంత మంది రైతులకు ఓటీపీ వచ్చినా డబ్బులు రాలేదు.
తమ ధాన్యం సంగతేంటో చెప్పాలని రైతులు కొనుగోలు కేంద్రం నిర్వాహకుడిని గట్టిగా నిలదీయగా.. వడ్డేపల్లిలోని శివసాయి బాలాజీ రైస్‌మిల్‌కు వెళ్లినట్టు చెప్పారు. అయితే ఆ మిల్లులో అనుమతికి మించి ధాన్యం దించుకున్నారని, అందుకే అదనపు ధాన్యానికి ట్రక్షీట్లు జారీ చేయడంలేదని తెలిసింది. సదరు మిల్లుకు అదనపు ధాన్యాన్ని తరలించిన సివిల్ సప్లయ్ అధికారులు.. అందుకు సంబంధించి అనుమతులు ఇప్పించడంలో నిర్లక్ష్యం వహించారనే విమర్శలున్నాయి. అదనపు ధాన్యానికి అనుమతి ఇచ్చేది లేదని కలెక్టర్ తేల్చి చెప్పినట్టు తెలిసింది.
అదనపు ధాన్యం దింపించిన అధికారులకు అందుకు సంబంధించి అనుమతులు ఇప్పించాలని తెలియదా? 12 రోజులైనా అనుమతులు ఇప్పించకుండా ఏం చేస్తున్నట్టు? కనీసం ఆ విషయం రైతులకు ఎందుకు చేరవేయలేదు? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కూడా మిల్లులకు అదనపు ధాన్యాన్ని తరలించిన ఆయా జిల్లాల సివిల్ సప్లయ్ అధికారులు.. ఆ తర్వాత వాటికి అనుమతి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.