Terror Links | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 20 మందికి పైగా మానవబాంబులుగా తయారయ్యేందుకు సిరాజ్, సమీర్ శిక్షణ ఇచ్చినట్టు తెలిసింది. విజయనగరం ఉగ్ర కుట్రకేసులో కీలకంగా ఉన్న సిరాజ్, సమీర్ ఈ విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో తెలిపినట్టు సమాచారం. ఇప్పుడు ఆ 20 మంది ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? వారు నిజంగా మానవబాంబులేనా? అన్న నిగూఢమైన విషయాలను పోలీసులు, దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉన్నది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన పలువురు స్లీపర్ సెల్స్ వీరితో జత కలిసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సికింద్రాబాద్ బోయగూడలోని రైల్ కళారంగ్ బస్తీకి చెందిన సయ్యద్ సమీర్‌కు ఉగ్ర లింకులు ఉంటడమే ఇందుకు కారణం. ఒకవైపు లిఫ్టు మెకానిక్‌గా పనిచేస్తున్న సమీర్.. కొందరు యువకులతో నిత్యం సమావేశమైనట్టు స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన పలువురు యువకులతో తన ఇంట్లోనే నిత్యం సమావేశాలు నిర్వహించేవాడని బస్తీవాసులు అంటున్నారు. దీంతో వారంతా ఎవరు? సిరాజ్, సమీర్ చెప్పిన ఆ 20 మంది మానవబాంబులు వాళ్లేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సిరాజ్ చెప్పినట్టు వారే మావనబాంబులైతే.. తెలంగాణలో హైఅలర్ట్ ప్రకటించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు రద్దు చేశారనే వాదనా వినిపిస్తున్నది.
సిరాజ్ రెహ్మాన్, సయ్యద్ సమీర్ ఢిల్లీ, బెంగళూరు, ముంబై, విజయనగరం, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల కోసం ఇప్పటికే ప్రాంతాలను ఎంచుకున్నట్టు శనివారం నాటి విచారణలో తేలింది. వారి ప్రధాన లక్ష్యం హైదరాబాద్‌గానే ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగానే వీళ్లు బాంబులు తయారు చేయడం, వాటి సామగ్రిని హైదరాబాద్ నుంచే ఆర్డర్ పెట్టడం వంటివి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ కేసులో సమీర్ వాంగ్మూలం కీలకం కానున్నట్టు దర్యాప్తు సంస్థ అధికారులు భావిస్తున్నారు.
సమీర్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ ద్వారా ఇటు నిందితులకు, సౌదీ నుంచి ఆపరేట్ చేస్తున్న హ్యాండ్లర్లకు టచ్‌లో ఉన్నాడు. హైదరాబాద్ కేంద్రంగా పలువురికి సహాయం అందించడం, వారికి షెల్టర్ ఇవ్వడం, బాంబుల తయారీలో సిరాజ్‌కు సహకరించడం వంటి కీలక పనులను సమీర్ చేశాడు. దీంతో సమీర్ ఇంకా ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నాడు? ఎవరెవరిని కలిసేవాడు? అనే విషయాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు కూపీ లాగుతున్నారు.
మొదటి నుంచి వరంగల్‌కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్, యూపీకి చెందిన బాదర్ ఎక్కడ? అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఉగ్ర కుట్రల కేసులో సిరాజ్, సమీర్ అరెస్టు అయ్యారని తెలుసుకొన్న వీరిద్దరూ పరారీలో ఉన్నారు. వీరిద్దరూ దొరికితే కానీ, విదేశీ లింకులు కూడా బయటపడే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. ఇప్పటికే సిరాజ్, సమీర్‌తోపాటు బాదర్, ఫర్హాన్ కుటుంబసభ్యులు, వారి బంధు, మిత్రుల కదలికలపై నిఘా పెట్టారు.
టిఫిన్ బాక్సులతో బాంబుల తయారీ గురించి యూట్యూబ్‌లో వారు నేర్చుకున్నట్టు ఇప్పటికే గుర్తించారు. డమ్మీ బ్లాస్ట్‌ల తర్వాత.. నేరుగా అసలు పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్టు తెలిసింది. ‘ఇంకో నాలుగు రోజులు ఆగి ఉంటే.. నా సత్తా తెలిసేది’ అని కామెంట్ చేసిన సిరాజ్.. పోలీసులకు దొరకకపోయి ఉంటే ఎక్కడ పేలుళ్లకు పాల్పడేవాడో ఊహించుకుంటేనే మతిపోతుందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పడం గమనార్హం. దీంతో అంతర్జాతీయ స్థాయిలో నిందితుల బ్యాంకు అకౌంట్లు, సోషల్ మీడియా ఖాతాలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టారు.
ఇటీవల తెలుగు రాష్ర్టాల్లో ఓ వర్గానికి చెందిన వారిపై వరసగా దాడులు జరుగుతున్నాయని, ఆ దాడులను తిప్పికొట్టేందుకే సిరాజ్, సమీర్ మానవబాంబులుగా మారాలని సిద్ధపడినట్టు దర్యాప్తులో తెలిసింది. అవసరమైతే బాంబులతో ప్రతిదాడులకు దిగాలనే ప్రణాళికలు వేసినట్టు దర్యాప్తులో తెలిసింది. ఈ క్రమంలో మైనార్టీ వర్గానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రముఖులు మాట్లాడితే.. వారికి కౌంటర్‌గా కామెంట్లు పెట్టడంలో చురుగ్గా ఉండే వారిని ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రసంగం వీడియో కింద హిందువులకు వ్యతిరేకంగా సిరాజ్ కామెంట్లు పెట్టినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. ఇంత జరుగుతున్నా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం ఉగ్ర కదలికలను పసిగట్టడంలో విఫలమైందని పలువురు ఆరోపిస్తున్నారు. గతం నుంచీ ఉగ్రవాదుల కన్ను హైదరాబాద్‌పైనే ఉన్నదన్న విషయం తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి.