హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : పొలాలు బీడు వారినా పరవాలేదు గానీ, బీరు తయారీకి నీరు మాత్రం ఆగొద్దు! సాగు, తాగునీటికి జనం అల్లాడినా.. బీరు కంపెనీలకు నష్టం కలుగొద్దు! పంటలు ఎండి రైతుల కడుపు మండినా.. బ్రూవరీలు, వాటి యజమానులు మాత్రం సల్లంగుండాలె! నోటికి అన్నం పెట్టే రైతుల పొలాలు ఎండబెట్టి.. నెత్తికి నిషానిచ్చే బీరు తయారీదార్లకు ఎలాంటి ఆటంకం లేకుండా నీళ్లు అందించాలె! రేవంత్ సర్కార్ తాజా నిర్ణయం చూస్తుంటే అన్నదాతలు రగిలిపోతున్నారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల వేళ నిపుణుల కమిటీ ఇచ్చిన ముందస్తు సలహాకు పాతరేసి, ఇద్దరు అధికారులను మాత్రం బీరు కంపెనీల బాగోగుల కోసం పురమాయించిన తీరు విస్తుగొలుపుతున్నది. మూడు నెలలైనా 1,800 గ్రామాల ప్రజలు, మహానగరవాసుల గురించి పట్టించుకునే తీరిక లేని సర్కార్, బీరు కంపెనీలకు మాత్రం ఆరు నెలలకు సరిపడా నీటిని ఎలా ఇవ్వాలనే విషయమై తీవ్ర కసరత్తు చేసిన తీరే బాధాకరం!
సింగూరే ప్రధాన జలవనరు
1,800 గ్రామాలు సహా హైదరాబాద్ నగర తాగునీటికి సింగూరు ప్రాజెక్టే ప్రధాన ఆధారం. భాగ్యనగరానికి రోజుకు 120 మిలియన్ గ్యాలన్ల నీళ్లు సింగూరు నుంచి వస్తాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న ఆరు బీరు కంపెనీలకూ ఇదే ప్రధాన జలవనరు. రోజుకు 2.64 కోట్ల లీటర్ల నీళ్లు కంపెనీలకు పోతాయి. సింగూరు డ్యామ్ కట్ట దెబ్బతిన్నది. 600 మీటర్ల మేరకు రివిట్మెంట్ డ్యామేజ్ అయింది. మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. డ్యామ్ మరమ్మతులు మొదలు పెట్టాలంటే ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేయాల్సి ఉంటుందని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఈ లోగా తాగు, సాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మూడు నెలల కిందటే రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సూచించింది. అయినా ఇప్పటి వరకు ప్రజల తాగునీరు, సాగునీటి కోసం ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. కానీ బీరు కంపెనీలకు ప్రత్యామ్నాయ నీటి సరఫరా కోసం ఉరుకులు పరుగులు పెట్టింది. సంగారెడ్డి జిల్లాలోని బీరు కంపెనీలకు (బ్రూవరీలను) ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను పంపించి వాస్తవ పరిస్థితిని సమీక్షించింది. ఫిబ్రవరి నుంచి జూన్ రెండోవారం వరకు బీరు కంపెనీలకు నీటి కటకట లేకుండా ప్రణాళికలు రూపొందించింది. ప్రత్యామ్నాయ నీటి వనరులను వాడుకునేలా అనుమతులు ఇచ్చింది. ఆరు కంపెనీలు మూడు షిఫ్టుల్లో నిరాటంకంగా బీరు ఉత్పత్తి చేయడానికి అవసరమైన నీటి సరఫరా ఏర్పాట్లకు కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారు.
ప్రాజెక్ట్ నుంచి జలాల కుదింపు
ప్రమాదకరంగా మారిన సింగూరు ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల్లో భాగంగా జలాల కుదింపు ప్రారంభమైంది. ప్రస్తుతం డ్యామ్‌లో 16.02 టీఎంసీలున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారం ఆనకట్టను రిపేర్ చేయడానికి నీళ్లను 8 టీఎంసీలకు తగ్గించాల్సి ఉండగా ఇందుకోసం ప్రాజెక్టు నుంచి జలాలను ఖాళీ చేసే ప్రక్రియ ఈనెల 10 నుంచి ప్రారంభమైంది. రోజుకు 2,500 క్యూసెకుల చొప్పున నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ లెక్కన ఫిబ్రవరి చివరి నాటికి లేదా మార్చి మొదటి వారంలో ప్రాజెక్టు నీటిమట్టం 8 టీఎంసీలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టుకు దిగువన ఉన్న మంజీరా బరాజ్, మెదక్ జిల్లా వనదుర్గా (ఘనపురం) ఆనకట్ట కింద 80 వేల ఎకరాలు, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా 80 వేల ఎకరాలు మొత్తంగా 1.60 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. హైదరాబాద్ మహానగరంతో పాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 1,800 గ్రామాలకు మిషన్‌భగీరథతో తాగునీటి అవసరాలు తీరుతున్నాయి.
బ్రూవరీలకు ఇబ్బందుల్లేకుండా
రాష్ట్రంలో ఆరు బీరు ఉత్పత్తి కర్మాగారాలున్నాయి. అవికూడా సంగారెడ్డి జిల్లాలో మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలోనే విస్తరించాయి. ఆరు బ్రూవరీస్ రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 6.98 లక్షల కేసులు (కేసు = 12 సీసాలు). సగటున ఏడాదికి 7.5 కోట్ల కేసుల బీరు ఉత్పత్తి అవుతుందని అంచనా. ఉత్పత్తి కోసం ఒక్క బ్రూవరీలో రోజుకు 1,000 కి.లీటర్ల ప్యూరిఫైడ్ నీరు వినియోగిస్తారు. (కిలోలీటర్ = 1,000 లీటర్లు) ఒక్క లీటర్ స్వచ్ఛమైన జలం పొందాలంటే నాలుగు లీటర్ల నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుందని బ్రూవరీస్ ఉద్యోగులు చెప్తున్నారు. ఈ లెక్కన ప్రతి కంపెనీ సగటున 44 లక్షల లీటర్ల నీటిని వాడుకుంటున్నది. ఇతర బయోలాజికల్ అవసరాలు, మొక్కలకు నీళ్లు తదితర అంశాలను కూడా కలుపుకొంటే 45 లక్షల లీటర్ల నీళ్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఆరు కంపెనీలకు కలిసి రోజుకు 2.74 కోట్ల లీటర్ల నీళ్లు సింగూరు నుంచే అందుతున్నాయి.
పంటలకు క్రాప్ హాలిడే ప్రమాదం
సింగూరు డ్యామ్‌కు మరమ్మతుల నేపథ్యంలో ప్రాజెక్టు కింది సాగుభూములు, గ్రామాలకు తాగు, సాగునీటిపై చర్చించేందుకు నవంబర్‌లో నిపుణుల కమిటీ సమావేశమైంది. కట్ట రివిట్మెంట్ను రిపేర్ చేయాలంటే డ్యామ్‌ను ఖాళీ చేయాల్సిందేనని నిర్ధారించింది. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులు ఏర్పడుతాయని కమిటీ తేల్చింది. సంగారెడ్డి, పటాన్చెరువు, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్, నర్సాపూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని సుమారు 1,800 గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడనుందని, వాటికి ప్రత్యామ్నాయ వనరుల కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది. రాబోయే ఎండకాలం దృష్ట్యా సింగూరు నీటిని తోడేస్తే ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అయినా రాష్ట్ర సర్కార్ ఇప్పటికీ కార్యాచరణ ప్రకటించలేదు, నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించలేదు. దీంతో వరి పొట్టకొచ్చే సమయానికి నీరు అందని ప్రమాదం ఉండటంతో ఆయా జిల్లాల్లో 1.60 లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారనున్నది. వచ్చే సీజన్‌కు మంజీరా పరీవాహక ప్రాంతంలో క్రాప్ హాలిడే ప్రకటించే ప్రమాదమూ నెలకొన్నది.
బీరు తయారీకి ముందస్తు ప్రణాళికలు
బీరు ఉత్పత్తికి అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది. రాబోయే ఆరు నెలలు బీర్ల ఉత్పత్తికి ఆటంకం కాకుండా ఉండాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది. సర్కార్ ఆదేశాలతో కొద్దిరోజుల కిందట ఎక్సైజ్ సెక్రటరీ రఘునందన్ రావు, కమిషనర్ హరికిరణ్ సంయుక్తంగా సంగారెడ్డి జిల్లాలో పర్యటించి బీరు కంపెనీలను పరిశీలించారు. బీరు ఉత్పత్తి, నీటి సరఫరా వివరాలు యాజమాన్యాలను అడిగి తెలుసుకున్నారు. సింగూరు జలాల కొరత ఏర్పడనున్న నేపథ్యంలో ముందుగానే ఉత్పత్తులు పెంచుకోవాలని, వేసవి డిమాండ్‌కు అనుగుణంగా నిల్వలు ఉంచుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. ఆరు కంపెనీలు మూడు షిఫ్టుల్లో ఎలాంటి అంతరాయం లేకుండా అవసరమైన జలాలు ప్రత్యామ్నాయంగా సమకూర్చుకోవాలని, అవసరమైన అనుమతులు ఇవ్వాలని అక్కడికక్కడే ఎక్సైజ్ కమిషనర్‌ను ఆదేశించారు. నీటి ఎద్దడి ఏర్పడినా బీరు ఉత్పత్తి ఆగకుండా కంపెనీలకు నీటి సరఫరా చేయాలని కలెక్టర్‌కు సైతం ఆదేశాలు జారీ చేశారు.