హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సింగూరు డ్యామ్ మరమ్మతు పనులకు ప్రభుత్వం సిద్ధమైంది. తాగునీటికి ఇబ్బందులు లేకుండా రెండు విడతలుగా మరమ్మతులు కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేసిన ఇరిగేషన్ శాఖ.. త్వరలోనే ఆ డ్యామ్‌ను ఖాళీ చేయాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపి అనుమతులు తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చింది. సింగూరు డ్యామ్ మరమ్మతుల అంశంపై ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ నేతృత్వంలో కామారెడ్డి సీఈ శ్రీనివాస్, ఓఅండ్ఎం ఈఎన్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నిపుణు లు, ప్రాజెక్టు ఇంజినీర్లు బుధవారం జలసౌధలో సమావేశమై పలు అంశాలపై చర్చించా రు. సింగూరు డ్యామ్ మరమ్మతులకు ప్రభు త్వం నుంచి అనుమతులు వచ్చాక ముందడుగు వేయాలని నిర్ణయించారు.
డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్స్ (డీఎస్ఆర్పీ) ఈ ఏడాది వానకాలం ముందు సింగూర్ డ్యామ్‌ను తనిఖీచేసి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలోని అంశాలపై ఎన్డీఎస్ఏ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సింగూరు డ్యామ్ అంత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నదని హెచ్చరించింది. డ్యామ్ ఎగువ వాలుపై ఉన్న రివెట్మెంట్తోపాటు ఎఫ్ఆర్ఎల్ భాగానికి సమీపంలోని వివిధ ప్రదేశాల్లో మట్టి వాలు రివెట్మెంట్ దెబ్బతిన్నదని వెల్లడించింది. డ్యామ్ భద్రత కోసం వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఎన్డీఎస్ఏ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ కమిటీ చైర్మన్ ఆ ఆనకట్టను సందర్శించడంతోపాటు ప్రాజెక్టు అధికారులు, హెచ్ఎండబ్ల్యూఏ అధికారులతో సమీక్షించారు.
రెండు విడతల్లో పనులు
ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా సిం గూరు డ్యామ్ మరమ్మతులను రెండు దఫాలుగా చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. సింగూర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టం 29 టీఎంసీలు. ఆనకట్టకు ఇరువైపులా 7 కి.మీ. మేరకు విస్తరించిన మట్టి, నీటి అలల తాకిడికి పలు చోట్ల మొత్తంగా 900 మీటర్ల భాగం దెబ్బతిన్నది. దీంతో మరమ్మతుల కోసం గత ప్రభుత్వ హయాంలోనే రూ.16 కోట్లతో అంచనాలు రూపొందించారు.
రోజుకు అడుగు చొప్పున ఖాళీ
ప్రస్తుతం సింగూరు డ్యామ్‌లో 522 మీటర్ల వరకు నీరు ఉన్నది. మరమ్మతుల కోసం డ్యామ్‌ను ఖాళీ చేయాల్సి ఉన్నది. క్రమంగా రోజుకు అడుగు చొప్పున ఖాళీ చేయాల్సి ఉంటుందని కమిటీ తెలిపింది. నిర్ణీత స్థాయి వరకు నీటిని ఖాళీ చేసేందుకు 20 రోజులకుపైగానే పడుతుందని కమిటీ అంచనా వేసింది.