హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూకి చెందిన 400 ఎకరాల్లో చెట్లను నరికివేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడం శుభపరిణామని, సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పచ్చటి భూముల్లో ప్రభుత్వం విధ్వంసానికి పూనుకోవడం దుర్మార్గమని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం కండ్లు తెరిచి అరాచకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆదేశాలు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు చట్టానికి అతీతంగా వ్యహరిస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా హెచ్‌సీయూ క్యాంపస్‌లో జీవవైవిధ్యాన్ని కాపాడాలని కోరారు.