హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ‘సమైక్య పాలనలో వలసలతో అరిగోసపడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లా.. కేసీఆర్ హయాంలోనే పచ్చబడ్డది.. ఇందుకు దండిగా పండిన పంటలు, ఆ పంటలు పండించిన రైతులే సాక్ష్యం’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఉద్ఘాటించారు. అలుపెరగని పోరాటంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే, నాడు ఉద్యమంలో ఏ పాత్రాలేని సీఎం రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని నిప్పులు చెరిగారు.
అధికారిక కార్యక్రమాల్లోనూ తూలనాడుతూ ఆ మహానేతను చిన్నగా చూపే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘స్వాతంత్రోద్యమంలో గాంధీ, నెహ్రూ పాత్రను ఎవరూ చెరిపేయలేరు.. రాష్ర్టాన్ని సాధించి చరిత్ర సృష్టించిన కేసీఆర్ ఆనవాళ్లనూ ఎవరూ తుడిచేయలేరు’ అని స్పష్టంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్‌యాదవ్‌తో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వనపర్తి పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీలేదని తేల్చిచెప్పారు.
కేసీఆర్ మొదలుపెట్టిన పనులకు నేడు శిలాఫకాలు వేయడమే తప్పా కొత్తగా చేపట్టిన పనులేమీలేవని విమర్శించారు. వెయ్యి కోట్ల నిధులంటూ డబ్బా కొట్టుకోవడమేనని, వచ్చిందేమీలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదని ప్రశ్నించారు. కేవలం మరో రూ.1,200 కోట్లు వెచ్చిస్తే పూర్తయ్యే పథకాన్ని నిలిపివేసిన పాలకులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి సొంత జిల్లా అభివృద్ధిపై నిజంగా నిబద్ధత, ఇక్కడి రైతులపై ప్రేమ ఉంటే వెంటనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసం చేయడం రేవంత్‌రెడ్డికి రివాజుగా మారిందని నిరంజన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. మొన్న వనపర్తిలో అధికారిక కార్యక్రమంలోనూ కేసీఆర్‌పై నిందలు వేయడం, పచ్చి అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ సభకు పార్టీ సభకు తేడా తెలియనివారు పాలకులు కావడం మన దౌర్భాగ్యమని ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టి 15 నెలలైనా రేవంత్ పాలనపై పట్టు సాధించనేలేదని చెప్పారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని, వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పాలనలో మంత్రితోపాటు అనేక పదవులు అనుభవించిన జూపల్లి కృష్ణారావు ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి ఝుటా మాటలు మాట్లాడుతున్నారని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్‌తోనే పాలమూరుకు మేలు జరుగుతుందని, ఆహో.. ఓహో అంటూ పొడిగిన నోటితోనే నేడు తెగనాడటం ఆయన ద్వంద్వనీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో మంత్రి పదవిరాగానే అప్పుడు ఏ ఒక్క పనికాలేదని పచ్చి అబద్ధాలు చెప్పడం జూపల్లికే చెల్లిందని తూర్పారబట్టారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల ప్రెస్మీట్లో తనకు ఏఐసీసీ ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్‌ను తమ పార్టీ వాళ్లు అమ్ముకున్నారని చెప్పారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90 కోట్లు ఖర్చుచేశారని బాహాటంగానే వెల్లడించారని గుర్తుచేశారు. చిన్నారెడ్డి చేసిన ఆ ఆరోపణలకు రేవంత్‌రెడ్డి ఏం సమాధానం చెప్తారు? ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని సూటిగా ప్రశ్నించారు.
‘వనపర్తి సభలో రూ.500 సిలిండర్ వస్తుందా? అని అడిగిన ముఖ్యమంత్రికి మహిళలు లేదు..లేదు.. అంటూ చేతులెత్తి చెప్పిన విషయం వాస్తవం కాదా? మీ పాలనా వైఫల్యానికి ఇదే నిదర్శనం కాదా? అని సీఎం రేవంత్‌రెడ్డిని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో మహిళలే కాదు ఏ ఒక్కరూ సంతోషంగా లేరని చెప్పారు. అన్నివర్గాలు మోసపోయామని భావిస్తున్నాయని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయలేదని, రైతుభరోసా ఎగ్గొట్టారని విమర్శించారు. మోసపూరిత ప్రభుత్వానికి బుద్ధిచెప్పేందుకు ప్రజలు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని హెచ్చరించారు.
‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి 14 ఏండ్లు పనిచేసిన. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేండ్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, ఐదేండ్లు వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన. నిరంతరం పార్టీలకతీతంగా పాలమూరు అభివృద్ధికే పాటుపడ్డ.. అని నిరంజన్‌రెడ్డి చెప్పారు. కానీ తాను రాజకీయాలను కలుషితం చేశానని సీఎం రేవంత్ తనపై అభాండాలు వేయడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్‌ను ఒప్పించి గట్టు రిజర్వాయర్‌ను సాధించి, రూ.50 కోట్లు మంజూరు చేయించి శంకుస్థాపన చేయించినం.. కానీ ఈ సీఎం ఆ రిజర్వాయర్ పనులకు మళ్లీ శిలాఫలకం వేయడం ఆశ్చర్యంగా ఉన్నదని పేర్కొన్నారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే కొత్త పనులు మంజూరు చేసి విరివిగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
‘కేసీఆర్ పాలనలోనే వనపర్తి జిల్లాగా రూపుదిద్దుకున్నది. రూ.550 కోట్లతో చేపట్టిన మెడికల్, నర్సింగ్ కాలేజీలు, ప్రభుత్వ దవాఖాన పనులు పురోగతిలో ఉన్నాయి. మూడేండ్ల క్రితమే జేఎన్టీయూ కాలేజీ మొదటి విడత పనులు పూర్తయ్యాయి. రెండోదశ పనులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ ప్రజలకు కండ్ల ముందరే కనిపిస్తున్నాయి’ అని నిరంజన్‌రెడ్డి వివరించారు. వనపర్తికి వచ్చిన సీఎం రేవంత్ ఆ పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేయడం విడ్డూరమని పేర్కొన్నారు. కేటీఆర్ రూ.21 కోట్లతో నాడు శ్రీకారంచుట్టిన ఐటీ టవర్ శిలాఫలకాన్ని ధ్వంసంచేసి తిరిగి ప్రారంభించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రేవంత్ సీఎంలా కాకుండా రాజకీయ పార్టీలో రెబల్ కార్యకర్తలా వ్యహరిస్తున్నారని విమర్శించారు.