హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణను ఎడారిగా మా ర్చే కుట్ర జరుగుతున్నదని, రేవంత్‌రెడ్డి చేసే ద్రోహంలో కాంగ్రెస్ మంత్రులు సైతం పాలు పంచుకుంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బుధవారం ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే మాత్రం తెలంగాణ సమాజం ముందు శాశ్వతంగా ద్రోహులు గా మిగిలిపోతారని పేర్కొన్నారు. కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్వహించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అసలు బనకచర్ల అంశమే లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పుతున్నారని, కానీ పోలవరం, బనకచర్ల మీద కమిటీ వేయాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్నట్టు.. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ బయట పెట్టాలని, దీంతో ఆ సమావేశంలో ఏం చర్చించారో అసలు గుట్టు రట్టవుతుందని తెలిపారు. అసలు ఆ సమావేశంలో ఏం చర్చించారో చెప్పకుండా, చర్చల స్థాయికి రావడం తెలంగాణ విజయం అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి.. స్వామి భక్తి కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే.. ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు.