హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి చిత్తశుద్ధి ఉంటే తన కొడుకు మీద వచ్చిన ఆరోపణల విషయంలో నిజాయితీ నిరూపించుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే తన పదవికి రాజీనామా చేసి నిష్పక్షపాత విచారణ కోరాలని సూచించారు. లేదంటే కేంద్ర ప్రభుత్వం స్పందించి బండి సంజయ్‌ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తన కుటుంబసభ్యులు చేసిన తప్పులను వెనకేసుకుని రాకుండా, వారి తప్పులను గమనించి సరిదిద్దుకోవాలని శనివారం ఒక ప్రకటనలో హితవుపలికారు. సంజయ్ కుమారుడి అఘాయిత్యంపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసేందుకు పోలీసులు మీనమేషాలు లెకించడం దుర్మార్గమని, బెయిలబుల్ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం శోచనీయమని విమర్శించారు.
బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి: జీవన్‌రెడ్డి
ఖలీల్‌వాడి, మే 9 : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన తరుణంలో నైతిక బాధ్యత వహించి ఆయన తన పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే ప్రధాని మోదీ బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆర్మూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైందని, ఆర్ఎస్ బ్రదర్స్(రేవంత్‌రెడ్డి, సంజయ్) కేసు నమోదు కాకుండా దాదాపు 8 గంటలు యత్నించారని తెలిపారు. కేసు పెట్టకుంటే చనిపోతానని బాధితురాలు చెప్పడంతో చివరకు కేసు నమోదు చేశారని తెలిపారు.