హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా సాధించడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమైనట్టు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతలకు కాంగ్రెస్, బీజేపీ శాపంలా మారాయని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో పాలమూరు ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వలేమని కేంద్రం సమాధానం ఇచ్చిన నేపథ్యంలో.. బీజేపీ నేతలు దీనిపై సమాధానం చెప్పాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
పాలమూరు బిడ్డనని చెప్పుకొనే సీఎం రేవంత్.. ఏడాదిగా పాలమూరు ఎత్తిపోతలను పడావుపెట్టారని విమర్శించారు. ఢిల్లీకి 31సార్లు వెళ్లినా ఒక్కసారి కూడా పాలమూరు ఎత్తిపోతల గురించి కేంద్రాన్ని అడిగిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఇప్పటికే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించినందుకు కాంగ్రెస్, ఒక ఎంపీని గెలిపించినందుకు బీజేపీ పాలమూరు ప్రజలకు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అని ప్రశ్నించారు.