Singireddy Niranjan Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 90 శాతం పూర్తయ్యాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టును ఆపడమేంటని ఆయన ప్రశ్నించారు. తట్టెడు మట్టి తీయకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వంపై అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అనేక కేసులు వేసి ఏపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులు సహకరించారని ఆరోపించారు.
పాలమూరులో పడావు పడ్డ ప్రాజెక్టులపై గులాబీ పార్టీ సమరభేరీ మోగించింది. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు నింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లతో కూడిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సందర్శించింది. నార్లపూర్ పంప్‌హౌజ్, రిజర్వాయర్, వట్టెం పంప్‌హౌజ్, కరివెన రిజర్వాయర్లను సందర్శించారు. ప్రాజెక్టులను పడావు పెట్టిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. జూరాల నుంచి పాలమూరుకు నీళ్లు అంటేనే పెద్ద కుట్ర అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తప్పుల తడకగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ఇచ్చారని విమర్శించారు. హరీశ్‌రావు పవర్ఫుల్ ప్రజెంటేషన్‌తో ఉత్తమ్‌కు పీపీటీతో సమాధానమిచ్చారని తెలిపారు. ప్రజలకు అన్ని విషయాలపై సంపూర్ణ అవగాహన ఉందని అన్నారు. కృష్ణా నది నీళ్లను తెలంగాణకు దక్కకుండా చేసేందుకే కుట్రలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.అప్పుడైనా.. ఇప్పుడైనా కృష్ణా నీళ్లు పాలమూరుకు రాకుండా చేస్తున్నారని అన్నారు. నిజాం కాలంలోనే కృష్ణా నీటి కోసం అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని తెలిపారు. తుంగభద్రలో నీటి పంపకాలపై 65 టీఎంసీల కోసం 1944లోనే ఒప్పందాలు జరిగాయని అన్నారు. భీమా ప్రాజెక్టును యాదగిరి జిల్లాలో మొదట ప్రతిపాదించారని, ఆలమట్టిని కూడా నిజాం కాలంలోనే ప్రతిపాదించారని తెలిపారు. పాలమూరుకు 174 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని నిజాం పలు ప్రాజెక్టులను నిర్మించారని పేర్కొన్నారు. కానీ నిజాం కాలంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులను నెహ్రూ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు. అప్పటి నుంచే తెలంగాణకు అన్యాయం చేయడం ప్రారంభమైందని తెలిపారు.
సిద్దేశ్వరం దగ్గర కట్టాల్సిన శ్రీశైలం ప్రాజెక్టును 86 కిలోమీటర్ల కింద కట్టారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. సిద్దేశ్వరం దగ్గర ఆ ప్రాజెక్టు కట్టి ఉంటే గ్రావిటీ ద్వారా పాలమూరుకు నీళ్లు వచ్చేవని పేర్కొన్నారు. జల విద్యుత్ కోసం కట్టిన శ్రీశైలం నుంచి తెలుగుగంగ పేరుతో నీటిని తరలించారని అన్నారు. తెలుగుగంగ ద్వారా కడప, నెల్లూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు నీళ్లు అందించారని పేర్కొన్నారు. కృష్ణా నదిని మొత్తం మలుపుకు పోయేలా పోతిరెడ్డిపాడును చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం దరిదాపుల్లోకి రాకుండా చేసే కుట్ర అప్పుడు జరిగిందని.. ఇప్పుడు కూడా జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ లేవనెత్తిన అంశం అసాధ్యమని తెలిపారు.