హైదరాబాద్ : సహకార సంఘాల నిర్వీర్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) కుట్ర పన్నుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. గడువు ముగిసి రెండేళ్లు కావస్తున్నా పాలక మండళ్లకు ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణం అన్నారు. ఎన్నికలకు వెళితే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని నామినేటెడ్ పద్దతిలో పాలకమండళ్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు. నామినేటెడ్ పద్దతిలో సహకార సంఘాల పాలకవర్గాల నియామకం చేయాలన్న యోచన పూర్తి అప్రజాస్వామికమని విమర్శించారు.
అలాంటి ఆలోచన ఉంటే ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాలతో రేవంత్ రెడ్డి సర్కార్కు దిమ్మదిరిగిపోయిందన్నారు. ఎన్నికలకు వెళ్తే గుణపాఠం తప్పదనే ఉద్దేశంతో నామినేటెడ్ పద్ధతిలో వెళ్తున్నట్లు తెలుస్తుందన్నారు. సహకార సంఘాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని పేర్కొన్నారు. సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.