రాజన్న సిరిసిల్ల, జూలై 11( నమస్తే తెలంగాణ) : ప్రముఖ సినీ గాయని జానకితో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. ఆమె తండ్రి వృత్తి రీత్యా టీచర్ కావడంతో సిరిసిల్లకు బదిలీపై వచ్చి ఇక్కడ నివాసం ఉన్నారు. అప్పుడు జానకి వయస్సు మూడేండ్లు. సిరిసిల్లలో తన అనుబంధాన్ని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో గతంలో పంచుకున్నారు. సిరిసిల్లలో సర్కస్ చూసి, సర్కస్లో వేసే ఫీట్లు సైతం చూస్తూ చేసేదానినని అందులో వివరించారు. అలాగే, వేములవాడకు సిరిసిల్ల నుంచి ఎడ్లకచ్చురంపై వెళ్లి బాలనాగమ్మ చూసినట్లు గుర్తు చేసుకున్నారు. సినిమా చూసి వచ్చిన తరువాత సినిమాలోని పాటలు పాడానని వివరించారు. గాయకురాలిగా ఎదిగిన తరువాత వేములవాడలో జరిగే త్యాగరాయ అరాధనోత్సవాలకు హాజరై భక్తిపాటలను అలపించారు. అలాగే, జిల్లాలోని హాన్మాజిపేటకు చెందిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి రచించిన ఎన్నో మధురగీతాలను అమె పాడి సంగీత ప్రియులను అలరించారు. కాగా, ఆమె శనివారం గుండెపోటుతో మైసూర్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వార్త రావడంతో జిల్లాలోని సినీ ప్రియులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.