నమస్తే తెలంగాణ నెట్వర్క్: దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ప్రభుత్వ రంగాలను తెగనమ్ముతున్న ప్రధాని మోదీ రాకపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విభజన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చని ఆయనకు తెలంగాణ గడ్డపై కాలుపెట్టే నైతికత లేదని జనం మండి పడుతున్నారు. విద్య, ఉద్యోగరంగాలపై కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్ష, కక్ష సాధింపు చర్యలపై విద్యార్థి లోకం భగ్గుమంటున్నది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీకి వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ‘మోదీ గోబ్యాక్’ అంటూ గోదావరిఖని పట్టణం దద్దరిల్లింది. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ జరిగింది. ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన మరో ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు. వామపక్ష పార్టీలు శనివారం రామగుండం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి.
వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న మోదీ రాకను అన్నివర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాలని సీపీఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు శెట్టి వెంకన్న పిలుపునిచ్చారు. విభజన చట్ట ప్రకారం రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ, జిల్లాకో నవోదయ పాఠశాల, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు పరిశ్రమను ఇప్పటివరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు మహేందర్ ప్రశ్నించారు. ప్రధాని గుజరాత్ రాష్ట్రానికా.. దేశం మొత్తానికా? అన్నారు. టీఆర్ఎస్ అనుబంధ టీఆర్ఎస్వీతోపాటు పలు విద్యార్థి సంఘాలు అన్ని విశ్వవిద్యాలయాలు, నియోజకవర్గ కేంద్రాల్లో శనివారం నల్లజెండాలతో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఏడాదికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు. దేశంలో 80 శాతం ఉన్న బీసీలకు కేం ద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం అ త్యంత దుర్మార్గమని వాపోయారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో 157 వైద్య కళాశాలలు, 16 ఐఐఎంలు, 87 నవోదయ స్కూ ళ్లు ఏర్పాటు చేసినా, ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని టీఎస్‌జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానం పేరుతో విద్యను కాషాయీకరణ చేస్తున్న మోదీ పర్యటనను అడ్డుకొంటామని ఆయన హెచ్చరించారు. జీఎస్టీ విధింపుతో చేనేత పరిశ్రమ కుదేలవుతున్నదని, జీఎస్టీ రద్దు చేశాకే ప్రధాని తెలంగాణలో అడుగుపెట్టాలని చేనేత యూత్‌ఫోర్స్ చైర్మన్ అలిశెట్టి అరవింద్ డిమాండ్ చేశారు. చేనేతపై జీఎస్టీకి వ్యతిరేకంగా రామగుండం, కరీంనగర్, హైదరాబాద్‌లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణ, విద్యుత్తు సవరణ బిల్లు, నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు. మోదీ రాకను వ్యతిరేకిస్తూ శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో మోదీ గోబ్యాక్ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు.