గోదావరిఖని, సెప్టెంబర్ 24: సింగరేణి కార్మికుల లాభాల వాటాలో కోతపై టీబీజీకేఎస్ నిరసనల్లో భాగంగా మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ఆర్జీ-1, 2, 3 ఏరియాల్లో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీబీజీకేఎస్ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు వడ్డెపల్లి శంకర్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన నిరసనలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ.. సంస్థ ప్రకటించిన రూ.4,701 కోట్ల లాభాలపై 33 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్జీ-3 ఏరియా సెంటినరీకాలనీలో టీబీజీకేఎస్ ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు నాగెల్లి సాంబయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అక్టోబర్ 9న సింగరేణి కార్మికులకు బోనస్
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తేతెలంగాణ): సింగరేణి యాజమాన్యం కార్మికులకు అక్టోబర్ 9న లాభాల్లో బోనస్ చెల్లించనున్నది. వచ్చే నెల వేతనంతో పా టు దసరా అడ్వాన్స్‌గా కార్మికుల ఖాతా ల్లో జమచేయనున్నది. సింగరేణి సీఎండీ బలరాం మంగళవారం అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సింగరేణి డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలతో నిర్వహించిన సమావేశంలో విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు. లాభాల వాటా కింద మం జూరు చేసిన రూ. 796 కోట్లలో సంస్థలోని 42 వేలమంది కార్మికులు, ఉద్యోగులకు సగటున రూ.1.90 లక్షల చొప్పున బోనస్ దక్కనున్నది. 25 వేల మంది కాం ట్రాక్ట్ కార్మికులకు రూ. 5 వేల చొప్పున అందజేయాలని నిర్ణయించింది.