హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో సింగరేణి ఉత్పత్తి లక్ష్యాలను సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించారు. కొత్తగా ప్రారంభమయ్యే ఐదు కొత్త గనుల నుంచి 134 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని, తద్వారా వార్షిక లక్ష్యం 750 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించవచ్చునని అన్నారు. వచ్చే రెండేండ్లలో సంస్థ చేపట్టనున్న కొత్త ప్రాజెక్టులపై సింగరేణిభవన్‌లో శుక్రవారం సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, ప్రాజెక్టు ప్లానింగ్ విభాగం జీఎంలు, సంబంధిత ఏరియా జీఎంలతో ఎన్ శ్రీధర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
వచ్చే ఏడాది ఒడిశాలోని నైనీ నుంచి కనీసం 60 లక్షల టన్నులు, కొత్తగూడెం వీకే ఓసీ నుంచి 30 లక్షల టన్నులు, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీ నుంచి 4 లక్షల టన్నులు, ఇల్లందు జీకే ఓసీ నుంచి 10 లక్షల టన్నులు, రామగుండం కోల్‌మైన్ నుంచి 30 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని అధికారులను సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. అందుకు అనుగుణగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ కొత్త గనుల్లో కొన్నింటికి ఇప్పటికే పూర్తిస్థాయి అనుమతులు లభించాయని ఎన్ శ్రీధర్ తెలపారు. మిగిలిన పనులకు అన్ని అనుమతులను సత్వరమే సాధించాలన్నారు. 2024-25లో చేపట్టే ఓవీకే ఓసీ, తాడిచర్ల-2 తదితర గనుల అనుమతులకు కూడా ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో సంస్థ డైరెక్టర్లు బలరామ్, సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్, వెంకటేశ్వర్‌రెడ్డి, అడ్వైజర్లు డీఎన్ ప్రసాద్, సురేంద్రపాండే, ఈడీలు జే ఆల్విన్, సురేష్, జీఎంలు నరసింహారావు, సూర్యనారాయణ, రవిప్రసాద్, కొండయ్య, అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.