హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : భూగర్భ జలాల అభివృద్ధికి సింగరేణి సంస్థ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ‘సింగరేణి నీటి బిందువు.. జల సింధువు’ అనే కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. సింగరేణి వ్యాప్తంగా 50 మినీ చెరువులను ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ సీఎండీ ఎన్ బలరాం సోమవారం ప్రకటించారు. రెడ్‌హిల్స్‌లోని సంస్థ కార్యాలయం నుంచి సోమవారం అన్ని ఏరియాల జీఎంలతో సీఎండీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచడం, సమీప గ్రామాల ప్రజలకు ఎండాకాలంలోనూ తాగునీటిని అందించడం, జల వనరుల పెంపుదలకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. మినీ చెరువులను వర్షపునీటితోపాటు ఓపెన్‌కాస్టుల నుంచి వెలికి తీసిన నీటితో నింపుతామని తెలిపారు. సమీక్షలో సంస్థ డైరెక్టర్లు డీ సత్యనారాయణరావు, ఎల్వీ సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు, ఈడీ కోల్మూవ్మెంట్ ఎస్డీఎం సుబానీ, ఫారెస్ట్ అడ్వైజర్ మోహన్ పరిగెన్ పాల్గొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీలపై కూడా దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టే దిశగా చర్యలు చేపట్టాలని కులనిర్మూలన వేదిక, తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు.