సీసీసీ నస్పూర్, జూన్ 19 : వెంటనే తమకు రావాల్సిన పీఆర్పీ చెల్లించి, పెండింగ్ సమస్యలు పరిషరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌కాలనీలో బెల్లంపల్లి రీజియన్ అధికారులు నల్ల కండువాలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంవోఏఐ) ఆధ్వర్యంలో నస్పూర్ కాలనీ మనోరంజన్ సముదాయం నుంచి తలపెట్టిన ర్యాలీని సింగరేణి విభాగం అధ్యక్షుడు లక్షీపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి నర్సింహులు ప్రారంభించారు. రామగుండం, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల నుంచి పెద్ద సంఖ్యలో అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్‌రావు, శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు. పే అప్‌గ్రేడేషన్ 2006 లోనే కోల్ఇండియాలో అమల్లోకి వచ్చినప్పటికీ సింగరేణిలో ఇప్పటికీ మోక్షం కలుగడంలేదని విమర్శించారు. 2017 వేతన సవరణ నష్టాన్ని సరిచేస్తున్నప్పటికీ సింగరేణిలో అమలు చేయడంలేదని చెప్పారు. 2022, 2023 పీఆర్పీ చెల్లించాలని, సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మెకు కూడా సిద్ధమేనని హెచ్చరించారు.