Singareni | గోదావరిఖని : సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన సెక్యూరిటీ వింగ్ (రక్షణ విభాగం), మెడికల్ వింగ్ (వైద్య విభాగం)కు ఇద్దరు ప్రైవేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నతాధికారులను నియమించేందుకు సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను సంప్రదించకుండానే ఏకపక్షంగా సింగరేణి యాజమాన్యం అత్యంత కీలకమైన విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఉన్నతాధికారులను నియమించేందుకు నిర్ణయించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. సింగరేణి సంస్థలో ప్రస్తుతం రక్షణ విభాగానికి జీఎం సెక్యూరిటీ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. వైద్య విభాగానికి చీఫ్ మెడికల్ ఆఫీసర్ సీఎంవో ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే కాంట్రాక్ట్ పద్ధతిలో రక్షణ విభాగానికి చీఫ్ సెక్యూరిటీ అధికారిని నియమిస్తామని దీనికి తోడుగా వైద్య విభాగానికి చీఫ్ మెడికల్ సర్వీసెస్ (సిఎంఎస్) అధికారిగా నియమించడానికి నిర్ణయించారు. సింగరేణి జారీ చేసిన నోటిఫికేషన్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అధికారులను ఎందుకు నియమిస్తున్నారనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. ప్రస్తుతం ఉన్న అధికారులు కొనసాగుతూనే కొత్తగా కాంట్రాక్టు పద్ధతిలో నియమించే అధికారులు విధులు నిర్వహిస్తారా…? అనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. 63 సంవత్సరాల లోపు వయసు కలిగి రిటైర్ అయిన అధికారులు దరఖాస్తులు చేసుకోవాలని యాజమాన్యం పేర్కొంది. ఎంపికైన అధికారులకు నెలకు రెండు లక్షల రూపాయలు చొప్పున జీతాలు, ఇతర అలవెన్సులు కల్పించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
పోలీస్ శాఖలో డీఎస్పీ స్థాయి ఆ పై స్థాయిలలో రిటైర్ అయిన వారికి రక్షణ విభాగంలో అవకాశం కల్పిస్తామని, మెడికల్ విభాగంలో రైల్వే ఇతర ప్రభుత్వ రంగ ఆసుపత్రులలో 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం కలిగి రిటైర్ అయిన వారికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం రక్షణ, వైద్యంకు సంబంధించి లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దడానికి సింగరేణి సంస్థలోనే ఉన్న అధికారులను పర్యవేక్షణ నిమిత్తం నియమించుకోవలసి ఉండగా అందుకు భిన్నంగా ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్న ఉద్భవిస్తుంది. సింగరేణి సంస్థలు అధికారులను అలాగే ఉంచి వారిపై ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం కొనసాగేలా చేస్తే వర్గ పోరు తప్పదని అంటున్నారు.
సింగరేణి సంస్థలో 11 భూ ఉపరితల ఓపన్ కాస్ట్ గనులు 22 భూగర్భ గనులు పనిచేస్తున్నాయి వీటికి తోడుగా అనేక విభాగాలు ఉన్నాయి. వీటన్నిటిలో సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు స్క్రాప్ ఇతర సామాగ్రి దొంగిలించబడకుండా ప్రస్తుతం సింగరేణి సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ కార్ప్స్ ఎస్ అండ్ పిసి విభాగం పనిచేస్తుంది ఈ విభాగంలో ప్రైవేటు ఉన్నతాధికారి ప్రవేశించి వారిపై ఆధిపత్యం కొనసాగిస్తే సింగరేణిలో పనిచేస్తున్న రక్షణ విభాగం ప్రైవేట్ వ్యక్తి మధ్య వర్గ పోరు తప్పదని హెచ్చరిస్తున్నారు. సింగరేణితో సంబంధం లేకుండా కొత్తగా ఉన్నతాధికారిని ప్రైవేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తే వారు అవినీతి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని కూడా చర్చించుకుంటున్నారు. సింగరేణిలో ప్రస్తుతం రక్షణ విభాగం పకడ్బందీగానే పనిచేస్తుంది. ఈ విభాగంలో మరిన్ని మార్పులుచేర్పులు చేసి రక్షణ విభాగాన్ని పకడ్బందీగా చేస్తే సరిపోతుందని ప్రైవేట్ వ్యక్తులకు పగ్గాలు ఇవ్వడం ద్వారా సంస్థ అవినీతి మసకబారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.
సింగరేణి సంస్థ వైద్య విభాగంలో ఇప్పటికే అవినీతి పెరిగిపోయిందని సింగరేణి కార్మికుల అన్ఫిట్ కేసులలో భారీగా డబ్బులు మారుతున్నాయని చర్చకు వస్తున్న క్రమంలో మెడికల్ వింగ్లో మరో ఉన్నతాధికారిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తే ఆయనకు ఉన్న విశేష అధికారాలతో మెడికల్ అన్ ఫిట్ దందాలో తల దూర్చే అవకాశం ఉంటుందని ఆరోపణలు వస్తున్నాయి. వైద్య విభాగంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలతో పాటు వారి బాగోగులు చూసేందుకు నిర్ణయాలు తీసుకోవలసిన సింగరేణి సంస్థ అవి ఏమీ పట్టకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నత అధికారిని నియమిస్తే ప్రయోజనం ఏమి ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. అత్యంత కీలకమైన మెడికల్ ఆన్ పిట్ పనుల్లో తలదూర్చి కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. రెండు విభాగాలను ప్రతిష్ట చేయడానికి సింగరేణి యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకోవాలే తప్ప తలా తోక లేని విధానాలతో ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్ట్ పద్ధతిలో అప్పగించడం పనికిమాలిన చర్య అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి