హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో బొగ్గు గనులను చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. దక్షిణాఫ్రికా, మొజాంబిక్, బోట్స్వానా, జింబాబ్వే, నైజీరియా, టాంజానియా వంటి దేశాలు గ్లోబల్ ర్యాంకింగ్‌లో ముందంజలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగో దేశానికి సింగరేణి ప్రతినిధి బృందాన్ని త్వరలోనే పంపించనుంది. బొలివియా, ఆస్ట్రేలియా దేశాలకు కూడా నిపుణుల బృందాన్ని పంపాలని భావిస్తున్నది. సింగరేణి సంస్థ తెలంగాణ వెలుపల ఇప్పటివరకు ఒడిశాలోని నైనీ కోల్‌బ్లాక్‌ను మాత్రమే చేపట్టింది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ గనిని ప్రారంభించనుంది. ఈ ఒక్క గని నుంచి ఏడాదికి కోటి టన్నుల బొగ్గును సంస్థ ఉత్పత్తి చేయనుంది. ఈ ఏడాది కొత్తగూడెంలో వీకే ఓపెన్ కాస్ట్, రామగుండం రీజియన్‌లో రామగుండం కోల్‌మైన్, ఇల్లందు ఏరియాలో రొం పేడు ఓసీపీ, బెల్లంపల్లి ఏరియాలో గోలేటి ఓసీపీలు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఇటీవలే భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్‌లో మరో ఓసీ కోసం ప్రత్యేకంగా అధ్యయనం చే యించింది. తాడిచెర్ల -2 బ్లాక్, చెన్నూరులో కొత్త బ్లాక్‌ను త్వరలోనే ప్రారంభించనున్నది.