గోదావరిఖని, ఫిబ్రవరి 26: సింగరేణి సంస్థకు గుండెకాయగా చెప్పుకునే అన్వేషణ విభాగం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బెల్లంపల్లి విభాగాన్ని మూసివేసిన సింగరేణి యాజమాన్యం.. రామగుండం విభాగంలో పనిచేసే కార్మికులకు పనులు లేవనే సాకుతో పర్మినెంట్ కార్మికులను తొలగించి మొత్తం అన్వేషణ విభాగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుతం రామగుండం విభాగం కిందనే భూపాలపల్లి ఏరియా అన్వేషణ విభాగం పనులు సాగుతున్నాయి.
మొత్తం 150 మంది శాశ్వత కార్మికులు, 100 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసే ఈ డిపార్ట్మెంట్లో పనులు లేవని సాకుగా చూపుతున్నట్లుగా తెలుస్తుంది. సింగరేణిలో కొత్త గనులకు పర్యావరణ అటవీ అనుమతులు ఆలస్యం అవుతుండడం వల్లే వీరికి పనుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు కనిపిస్తున్నది. సింగరేణి తాడిచెర్ల బ్లాక్‌కు క్లియరెన్స్ వస్తే మరో మూడేండ్లపాటు వీరందరికీ పనులు ఉండే అవకాశం ఉంది. కానీ ఈ బ్లాక్నకు ఇప్పట్లో అనుమతులు వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో ఈ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
కాంట్రాక్ట్ కార్మికులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్, ప్రైవేట్ డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల బెల్లంపల్లి ఏరియాలో ఇవే పరిస్థితు అన్వేషణ విభాగాన్ని మూసివేయగా, పర్మినెంట్ కార్మికులను ఇతర విభాగాల్లోకి సర్దుబాటు చేశారు. మిగిలిన కొందరు కార్మికులను రామగుండం అన్వేషణ విభాగంలో విధులు కల్పించారు. అయితే ఇక్కడ డ్రిల్స్‌కి సరపడా కార్మికులు ఉండగా, బెల్లంపల్లి కార్మికులు అదనంగా ఉండిపోయారు. దీని పర్యావసానంగా కార్మికులకు రావాల్సిన పదోన్నతులు రాకుండా పోతున్నాయి. బెల్లంపల్లిలో పనిచేసిన అధికారులను బదిలీ చేసి ఒరిస్సాలోని నైనీ బ్లాక్, ఆ తర్వాత రామగుండం, కొత్తగూడెంలో సర్దుబాటు చేశారు.
కార్మికులకు పదోన్నతులు కల్పించని యాజమాన్యం, అధికారులకు మాత్రం ప్రమోషన్లు ఇచ్చి అందలం ఎక్కిస్తున్నది. అధికారులకు అన్ని రకాలుగా ప్రయోజనాలను కల్పిస్తూ జీటీ ల్యాబ్, ఎస్పీటీ టెస్టుల పేరిట మరికొన్ని కొత్త పనులను సృష్టించి వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారుల పదోన్నతులలో ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రతి మూడేండ్లకు పదోన్నతి లభించే విధంగా చేస్తున్నది. కొంత మంది పర్మినెంట్ కార్మికులు 15 ఏండ్లుగా పనిచేసినా ప్రమోషన్ రాకుండా పోతున్నది. ఇదంతా డిపార్టుమెంట్లో ఒక భాగమైతే, మరో వైపు కొత్త బ్లాక్‌ల కొరత ఎక్కువైంది.
ఇటీవల కాలంలో తాడిచెర్ల డ్రిల్లింగ్కు కేంద్రం అనుమతులు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖ అధికారులు అనేక కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తున్నట్లు తెలిసింది. ఫలితంగా కార్మికులకు విధులు లేక కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు లేక 40 రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఇంత జరిగినా సింగరేణిలో కొత్త బ్లాక్‌ల కోసం అటవీ శాఖ అనుమతుల కోసం ముఖ్య పాత్ర పోషించే జియాలజీ విభాగం అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి అనుమతులు కోసం ప్రయత్నాలు చేయాలని, పనులు కల్పించేలా చూడాలని కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ప్రైవేట్ డ్రైవర్స్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కోరుతున్నారు.