పెద్దపల్లి, జూన్ 13(నమస్తే తెలంగాణ): ‘సురక్షితంగా ఒక్క ప్రమాదం కూడా జరుగకుండా, ఒక బొగ్గు పెళ్ల, మట్టిగడ్డ కూడా పడకుండా బొగ్గు తీస్తాం’ ఇది సింగరేణి సంస్థలో కోట్లాది రూపాయల నిధుల ఖర్చుతో అత్యంత భారీ టెక్నాలజీతో అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఏర్పాటు సమయంలో యాజమాన్యం చెప్పిన మాటలివి. కానీ, కానీ, ప్రమాదాలు, సాంకేతిక లోపాల వల్ల ఈ ప్రాజెక్టు వివాదాలకు కారణమైంది. దీనికి తోడు సాంకేతిక సమస్యలు వెంటాడడంతో ఉత్పత్తి పూర్తిగా తగ్గింది.
ఫలితంగా సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు రోజురోజుకూ భారంగా మారి నష్టాలు తెచ్చిపెడుతున్నది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడ్యాల గ్రామ శివారులో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. 2008 నుంచి ప్రాజెక్టు పనులను ఆరంభించగా, ఉత్పత్తి మాత్రం 2014నుంచి ప్రారంభమైంది. అత్యాధునికమైన జర్మనీ, చైనా విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో బొగ్గును వెలికి తీసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చుచేశాయి.
దాదాపు రూ.1,500 కోట్ల వ్యయంతో చేపట్టగా, ఇందులో జర్మనీ, చైనా నుంచి దిగుమతి చేసుకొన్న అత్యాధునిక భారీ లాంగ్వాల్ యంత్రాల కోసం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేశారు. అడ్యాల పరిధిలోని భూగర్భంలో సుమారు 78.59 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఈ గని నుంచి కనీసం 35 ఏండ్లపాటు నిరంతరాయంగా బొగ్గును వెలికితీసేందుకు ప్రణాళిక రూపొందించారు. భూ ఉపరితలం నుంచి కనిష్ఠంగా 294 మీటర్ల నుంచి గరిష్ఠంగా 644 మీటర్ల లోతులో ఉన్న నాలుగు బొగ్గు పొరల నుంచి బొగ్గు తీయాలన్న ప్రాజెక్టు లక్ష్యం. అధికారిక వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.817 మిలియన్ టన్నులు.
అడ్రియాల ప్రాజెక్టు పూర్తిగా లాంగ్వాల్ టెక్నాలజీతో పనిచేస్తే రోజుకు 5,000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలదు. సాధారణ భూగర్భ గనుల్లో ఒక కార్మికుడు రోజుకు సగటున 1.5 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తే, ఈ అధునాతన అడ్రియాల గనిలో అది సగటున 4.5 టన్నుల కంటే ఎకువగా రికార్డు అయ్యింది. ఓపెన్ కాస్ట్(ఉపరితల గని) ద్వారా బొగ్గు తీసి వదిలేసిన చోట, ఆ ‘హైవాల్’ నుంచి నేరుగా లోపలికి సురక్షితంగా రంధ్రాలు చేసుకుంటూ వెళ్లే ‘పంచ్ ఎంట్రీ’ విధానాన్ని ఆసియాలోనే మొదటిసారిగా ఇకడ ప్రవేశపెట్టారు. గని లోపల కట్ చేసిన బొగ్గును నేరుగా బయటకు చేరవేసేందుకు చైనా నుంచి తెచ్చిన 9 కిలోమీటర్ల పొడవైన భారీ కన్వేయర్ బెల్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 11కేవీ హై-వోల్టేజీ విద్యుత్తు లైన్లను భారతీయ భూగర్భ గనుల్లో మొదటిసారి ఇకడే వాడారు.
అడ్రియాల ప్రాజెక్టులోని దాదాపుగా 78.59 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు ఇక్కడ మొత్తంగా నాలుగు సీమ్స్ను గుర్తించారు. ఒక సీమ్‌లో తక్కువ నాణ్యత గల బొగ్గు ఉండగా, మిగతా మూడు సీమ్స్ల్లోనే పనులు ప్రారంభించారు. ఫస్ట్ సీమ్‌లో 4 ప్యానళ్లను ఏర్పాటుచేయగా, ఇందులో 2014లోనే ఉత్పత్తి మొదలైంది. ఇందులో ఫస్ట్ సీమ్ మూడు ప్యానళ్ల నుంచి బొగ్గును తీస్తుండగా, మూడో ప్యానల్లో మంటల వల్ల బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడింది.
ఈ మూడో ప్యానల్లో లాంగ్వాల్ యంత్రమైన షేరర్తోపాటు చాక్లతో బొగ్గు తవ్వకాలు చేపడుతున్న సమయంలో మూడేండ్ల క్రితం ఒక్కసారిగా గ్యాస్, మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. దీని కారణంగా 12 ఏండ్లుగా ఇప్పటివరకు ఇక్కడ 10 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలనే వెలికి తీయగలిగారు.
పూర్తిగా చైనా, జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో ‘షేరర్’ లాంగ్వాల్ యంత్రంతో పాటు 145 సపోర్టింగ్ చాక్లతో రోజుకు 5వేల టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు పనిచేసేవి. అయితే భూగర్భంలో ఎగిసిపడుతున్న మంటల కారణంగా ఇందులో షేరర్తో పాటుగా 89వరకు సపోర్టింగ్ చాక్‌లు ఆ బ్లాక్‌లోనే సీజ్ చేశారు. ప్రాజెక్టులో ఎల్‌హెచ్‌డీ (లోడ్ హాల్ డంపర్)లు, ఎస్డీఎల్(సైడ్ డిశ్చార్జ్ లోడర్లు) వెలికి తీసిన 56 చాక్ల సాయంతో ప్రస్తుతం రోజుకు కేవలం 700 మెట్రిక్ టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది.
మూడో ప్యానల్లో ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు నిపుణులు నైట్రోజన్, సీవో-2, కార్బన్డయాక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్ పంపుతున్నారు. కానీ మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అక్కడ ఎయిర్ చిల్లింగ్ ప్లాంట్ ఏర్పాటుచేశారు. కానీ సాంకేతిక సమస్యలు మాత్రం తప్పడం లేదు. గ్యాస్, మంటల కారణంగా భారీ జర్మనీ, చైనాకు చెందిన లాంగ్వాల్ యంత్రాలను అందులోనే సీజ్ చేశారు. వాటిని వెలికితీసి మరో ప్యానల్లో బిగించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో ఆ చర్యలు సఫలం కావడం లేదు. దీంతో వేల టన్నులుగా రావాల్సిన ఉత్పత్తి వందల టన్నుల్లో వస్తుండటంతో సింగరేణిని అడ్రియాల ప్రాజెక్టు నిండా ముంచుతున్నదనే అపవాదును మూటగట్టుకుంటున్నది. దీంతో ఉత్పత్తి చేసినా, చేయకపోయినా రోజురోజుకూ వ్యయం మాత్రం పెరుగుతూనే ఉన్నది.
అడ్రియాల ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న బొగ్గు ఉత్పత్తితో సింగరేణి సంస్థకు లాభాలు రాకపోగా, తీవ్రమైన నష్టాలు వస్తున్నాయి. ప్రాజెక్టులో షేరర్తోపాటు ఇతర యంత్రాలు నడవకపోవడం వల్ల రోజూ సింగరేణికి నష్టమే వస్తున్నది. లాంగ్వాల్ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే బొగ్గు మెట్రిక్ టన్నుకు ఉత్పత్తి వ్యయం రూ.10 వేల నుంచి రూ.12వేల చొప్పున ఖర్చవుతుండగా, ఇక్కడ బొగ్గు విక్రయం ద్వారా ఒక మెట్రిక్ టన్ను(జీ-గ్రేడ్)కు రూ.3,500 మాత్రమే వస్తున్నది. దీంతో ఇక్కడ ఒక్కో మెట్రిక్ టన్నుకు నష్టం దాదాపు రూ.8,500 వరకూ సింగరేణి నెత్తిన నష్టాల రూపంలో బరువుగా మారుతున్నది.
అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులోని మూడో ప్యానల్లో ఏర్పడిన మంటలను శాస్త్రీయ అధ్యయనంతో తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు బ్లాక్‌ను సీజ్‌చేసి లోపల నైట్రోజన్, సీవో-2, కార్బన్డయాక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్‌తో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. సింగరేణి రెస్క్యూ బృందం మూడు నెలలు కష్టపడి యంత్రాలను వెలికితీసింది. ప్రధానమైన షేరర్తో పాటుగా సపోర్టింగ్ చాక్స్‌ను చాలావరకు వెలికి తీశాం. ఇంకా 89 వరకు చాక్‌లు లోపలే ఉన్నాయి. థర్డ్ సీమ్‌లో మూడున్నర కిలోమీటర్ల నిడివిని తగ్గించి 1,200 మీటర్లు చేశాం. పనులు నడుస్తున్నాయి. ఉత్పత్తి తక్కువగా వస్తుండటం వల్ల నష్టమే వస్తున్నది.
-కొలిపాక నాగేశ్వర్రావు, జీఎం,అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్, రామగుండం
అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలతో భూగర్భంలో ఏర్పడిన మంటలను ఆర్పేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. సీజ్ చేసిన బ్లాక్ నుంచి అతి కష్టమ్మీద కొన్ని యంత్రాలను బయటికి తీశారు. ఇంకా అనేక యంత్రాలు అందులోనే ఉన్నాయి. ఉత్పత్తి తక్కువ అవుతుండటంతో దానికి వ్యయం మాత్రం పెరుగుతున్నది. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి యంత్రాలను బయటికి తీసి వాటితో ఉత్పత్తిని పెంచితేనే మనుగడ సాధ్యం. లేదంటే సింగరేణి సంస్థ తీవ్ర నష్టాలను చవిచూస్తుంది.
– నాగెల్లి సాంబయ్య, టీబీజీకేఎస్ ఆర్జీ-3 వైస్ ప్రెసిడెంట్, రామగుండం