గోదావరిఖని: సింగరేణిలో (Singareni) 2021 జూలై 1 నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగుల సవరించిన పెన్షన్‌ను చెల్లించకుండా నిలిపివేశారు. పదో వేజ్ బోర్డుకు సంబంధించిన వేతనాల పెన్షన్లు మాత్రమే ఇంతకాలం చెల్లిస్తూ వస్తున్న సింగరేణి యాజమాన్యం ఇప్పుడు పెన్షన్లను నిలిపివేయడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. సింగరేణి వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది రిటైర్డ్ కార్మికులు ఫిబ్రవరి నెలలో పెన్షన్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదో వేజ్ బోర్డ్ కాల పరిమితి 2021 జూన్‌తో ముగిసింది. అయితే వేజ్ బోర్డు కాల పరిమితి ముగిసిన ఏడాదిలోపే 11వ వేజ్ బోర్డుకు సంబంధించి ఒప్పందం కుదిరింది. దీంతో పెరిగిన వేతనాలకు సంబంధించి 11వ వేజ్ బోర్డు కాల పరిమితిలో రిటైర్ అయిన కార్మికులకు బేసిక్‌లో 25 శాతం పెన్షన్‌గా చెల్లించాల్సి ఉంటుంది.
ఒప్పందం కుదిరిన కొన్ని నెలల తర్వాత రిటైర్ అయిన కార్మికులకు కొత్త బేసిక్‌పై పెన్షన్లు చెల్లించినప్పటికీ ఒప్పందం కాకముందు వేజ్ బోర్డు 11 కాల పరిమితిలో రిటైర్ అయిన కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. సంవత్సరాలు గడుస్తున్నా ఏరియర్స్, పెన్షన్ చెల్లించకుండా కాలయాపన చేయడంతో పాటు ఫిబ్రవరి నెల నుంచి దాదాపు 3 వేల మంది రిటైర్ కార్మికులకు సంబంధించిన పింఛన్లు నిలిపివేయడంతో వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆందోళన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలలోనే జీవన్ ప్రమాణ పత్రాలు సమర్పించడం అవి సమర్పించిన తర్వాత కూడా పెన్షన్లు ఎందుకు నిలిపివేశారని రిటైర్డ్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెన్షన్లు జాప్యం చేస్తే సహించేది లేదు: వాసిరెడ్డి సీతారామయ్య
నిలిపివేసిన పెన్షన్లు వెంటనే చెల్లించాలని పెన్షన్ ఏరియర్స్ బకాయిలు చెల్లించాలని, జనవరి నెలకు సంబంధించి నిలిపి వేసిన పెన్షన్లు వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC గుర్తింపు సంఘం) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. ఇప్పటికే గోదావరిఖని సీఎంపీఎఫ్ కార్యాలయంలో కమిషనర్ పచౌరితో మాట్లాడానని, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. ముఖ్యంగా సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు ఈ నెలలో బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన రెగ్యులర్ పెన్షన్‌ను జీవన్ ప్రమాణ్ పత్రాలు ఆన్లైన్లో ఇచ్చినప్పటికీ ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. పెన్షన్లు జమచేయక పోవడంతో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన తెలిపారు.
వెంటనే నిలిపి వేసిన రెగ్యులర్ పెన్షన్లు రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, అదే విధంగా పదకొండో వేజ్‌బోర్డులో దాదాపు వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల సవరణ పెన్షన్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన సవరణ పెన్షన్, ఏరియర్స్ కూడా చెల్లించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాఫీలు రాక చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారని, భర్త చనిపోతే భార్యకు వితంతు పెన్షన్ పొందేందుకు రివైజ్డ్ పీపీఓ కాపీ లేకపోవడంతో వితంతు పెన్షన్ దారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారికి ఆర్డర్ కాఫీలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం దన్ బాద్ లోని సీఎంపీఎఫ్ కమిషనర్‌కు లేఖ రాస్తానని, ఫిబ్రవరిలో రిటైర్డ్ ఉద్యోగుల పదకొండో వేజ్‌బోర్డు పెన్షన్ బకాయిలు చెల్లించాలని లేకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గోదావరిఖని సీఎంపీఎఫ్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.