హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ఆదివారం రామగుండం-1, శ్రీరాంపూర్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పర్యటించారు. రామగుండం-1లో జీడీకే 5 ఓపెన్కాస్ట్ను సందర్శించి ఉత్పత్తిని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ బేస్ వర్క్షాప్ను ప్రారంభించారు. ఓబీ డంపులపై నాటిన మొక్కలను పరిశీలించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకే ఓపెన్కాస్ట్ను సందర్శించి ఉత్పత్తి లక్ష్యం, రవాణాపై గని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. నీటి బిందువు- జలసింధువులో భాగంగా ఏర్పాటు చేసిన బలరామ జలనిధి మినీ చెరువును పరిశీలించారు. అనంతరం సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకొని ఇక్కడ నిర్మించనున్న 800 మెగావాట్ల అల్ట్రా సూపర్క్రిటికల్ థర్మల్ సెంటర్కు సంబంధించి భూమిపూజ పనులపై సమీక్షించారు.