Musi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు టెండర్ వివాదాస్పద మెయిన్‌హార్ట్ కంపెనీకి దక్కింది. ఈ డీల్ వెనుక కీలక పాత్ర పోషించినట్టు భావిస్తున్న భారత సంతతికి చెందిన సింగపూర్ మాజీ రవాణా శాఖ మంత్రి ఎస్ ఈశ్వరన్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. సింగపూర్ హైకోర్టు గత గురువారం ఆయనకి 12 నెలల జైలు శిక్ష విధించింది.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇద్దరు వ్యక్తుల నుంచి ఈశ్వరన్ గడిచిన ఏడేండ్లలో 2.61 కోట్ల విలువైన బహుమతులు తీసుకున్నట్టు రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. బహుమతుల స్వీకరణకు సంబంధించిన 4 ఆరోపణలను, న్యాయస్థానాన్ని తప్పుదోవపట్టించడానికి సంబంధించిన మరో ఆరోపణను ఈశ్వరన్ గత నెల 24న అంగీకరించారు.సోమవారం నుంచి ఆయన జైలు జీవితాన్ని ప్రారంభించారు. ఈశ్వరన్ బహుమతులుగా స్వీకరించిన వైన్ బాటిల్స్, గోల్ఫ్ క్లబ్స్, బ్రాంప్టన్ సైకిల్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కోర్టు విధించిన శిక్షను అనుభవించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, న్యాయస్థానం తీర్పును సవాల్ చేయబోనని ఆదివారం ఈశ్వరన్ తన ఫేస్బుక్ పోస్టులో రాసుకొచ్చారు. దీనిపై సింగపూర్ ప్రజలు భగ్గుమంటున్నారు. 1965లో సింగపూర్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక క్యాబినెట్ మంత్రి నేరస్తుడిగా శిక్ష అనుభవించడం ఇదే మొదటిసారని కామెంట్లు పెడుతున్నారు. మీ చర్యలతో భారత్, సింగపూర్ ప్రతిష్ఠ మసకబారిందన్నారు.
అమరావతి నగరాభివృద్ధి బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం అప్పగించిన సెమ్కాప్ అండ్ అసెండర్స్ సింగ్‌బ్రిడ్జ్ కంపెనీ ఈశ్వరన్‌కు చెందినది కావడం గమనార్హం. అంతేకాదు, మూసీ ప్రాజెక్టు దక్కించుకొన్న మెయిన్హార్ట్లో కూడా ఈయనకు ప్రధాన వాటాలు ఉన్నాయి.