Maktakunta | రామచంద్రాపురం, జనవరి 26: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెం డేండ్ల నుంచీ ఆ పార్టీ పెద్దలు భూ కబ్జాలు, ఆక్రమణలపైనే కన్నేశారన్న విమర్శలు వస్తున్నాయి. శివారు ప్రాంతాల చెరువులు, కుంటలను చెరబడుతూ ‘హస్త’గతం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయల విలువైన భూ ములను కొల్లగొడుతున్నట్టు ఇటీవలి పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా ముత్తంగి డివిజన్ పరిధి సందుగూడేనికి చెందిన మక్తకుంటను మాయం చేసేందుకు కొందరు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. వందలాది లారీలో కుంట ఎఫ్టీఎల్ను మట్టితో నింపుతూ చదును చేస్తున్నారు. కుంటలో చెట్లను ఎక్స్కవేటర్లతో తొలగించి ప్రహరీ కడుతున్నారు. కుంటలు, చెరువులను కబ్జాకోరల నుంచి విముక్తి చేస్తామని చెప్పిన ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులే మక్తకుంట ఆక్రమణలకు పాల్పడుతున్నట్టు తెలుస్తున్నది. నగర శివారులో ఉండటంతో కోట్ల విలువ చేస్తున్న మక్తకుంటను కాంగ్రెస్ పెద్దలు మింగేస్తున్నారని సందుగూడెం ప్రజలు చెప్తున్నారు.
ఆర్సీపురం రెవెన్యూ రికార్డుల ప్రకారం సందుగూడెంలో ఉన్న మక్తకుంట సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. సర్వే నంబర్ 349లో 29.31ఎకరాలు, సర్వేనంబర్ 316లో ఎకరం విస్తరించి ఉన్నది. 2013 సర్వే ప్రకారం కుంట విస్తీర్ణం 30 ఎకరాలుగా ఉన్నది. హెచ్ఎండీఏ సర్వే మ్యాప్ ప్రకారం 18.25 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది. దాదాపు 10 ఎకరాల భూమి బఫర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈకుంటపై అధికార కాంగ్రెస్‌కు చెందిన పెద్ద తలకాయల కన్ను పడింది. రాత్రికిరాత్రే కుంటను ఆక్రమించి చదును చేసేపనులు ప్రారంభించారు. నేరుగా ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లోనే వందలాది లారీలతో మట్టి తెచ్చి నింపుతున్నారు. బుల్డోజర్లతో మట్టి చదును చేసి పనులు చేస్తున్నారు. కుంట తూములు, నాలాలను మట్టితో మూసివేస్తున్నారు. ఆక్రమణలను అడ్డుకుంటున్న సందుకుంట గ్రామస్తులను బెదిరింపులకు గురిచేస్తూ యథేచ్ఛగా పనులు కొనసాగిస్తున్నారు. పట్టపగలే బుల్డోజర్లతో నక్షబాటను చదును చేసి, మట్టితో నింపుతున్నారు.
గతంలో నందిగామ, బానూర్, ఘనపూర్ గ్రామాల వారు నక్షబాట నుంచే సందుగూడెం మీదుగా ఈదులనాగులపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లేవారని గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని మట్టితో చదును చేసి కనుమరుగు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ప్రహరీ నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా కుంటను మింగేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుంట సర్వే మ్యాప్‌లను కూడా మార్చాలనే కుట్ర జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వంలో ముఖ్యనేత సన్నిహితుడి అండదండలతోనే ఈ ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు హద్దులు నిర్ణయించాలని కోరుతున్నారు. ఈ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే స్పందించి మక్తకుంటను రక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
మక్తకుంట ఎఫ్టీఎల్లో మట్టిని నింపుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వారం రోజుల క్రితం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఆక్రమణలు జరిగే ప్రాంతానికి వెళ్లి పరిశీలించాం. ఎఫ్టీఎల్లో మట్టిని నింపితే కేసులు నమోదు చేస్తామని వారిని హెచ్చరించాం. కుంటకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ హెచ్ఎండీఏకు పంపించాం. కుంటలో మట్టిని నింపినంత మాత్రాన ఎన్వోసీ ఇవ్వడం, మ్యాప్ మార్చడం అసాధ్యం. కుంట ఆక్రమణను అడ్డుకుంటాం. బాధ్యులపై కేసు నమోదు చేస్తాం. -సంతోషి, ఇరిగేషన్ ఏఈ