హైదరాబాద్, సంగారెడ్డి, జూలై 2 (నమస్తే తెలంగాణ)/పటాన్చెరు : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు.. ఘటన స్థలంలో భీతావహ దృశ్యాలు… సజీవ దహనమైన ఉద్యోగులు, కార్మికులు.. మృతుల సంఖ్యపై స్పష్టతలేదు. ఏమైందో చెప్పడానికి కంపెనీ ప్రతినిధులు అందుబాటులో లేరు. ప్రభుత్వం నుంచి సమీక్షలు లేవు.. సమాధానం చెప్పేనాథులు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబాల సభ్యులకు కడుపు రగిలిపోతున్నది. నివురుగప్పిన నిప్పులా ఉన్న వారి ఆవేశం బుధవారం భగ్గుమన్నది. మూడురోజుల తర్వాత పరిశ్రమను పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి దామోదర రాజనరసింహను బాధిత కుటుంబాల సభ్యులు అడ్డుకున్నారు. కనీసం మృతదేహాలను ఎప్పుడు అప్పగిస్తారో చెప్పాలని నిలదీశారు. శిథిలాలు, మృతదేహాల వెలికితీతలో జరుగుతున్న జాప్యంపై మండిపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులను అనునయించిన మంత్రి దామోదర రాజనరసింహ.. అధికారులు, సిబ్బంది చర్యలు కొనసాగుతున్నాయని, మృతదేహాలను వెలికితీసి అప్పగిస్తామని తెలిపారు. కొందరు బాధితుల కుటుంబ సభ్యులను కంపెనీలోకి తీసుకువెళ్లారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రమాదం జరిగినప్పటి నుంచి పత్తాలేకుండా పోయిన సిగాచి పరిశ్రమ యాజమాన్యం ఎట్టకేలకు దిగివచ్చింది. బుధవారం కంపెనీ డైరెక్టర్ చిదంబరం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పటాన్చెరు ఏరియా దవాఖానలో క్షతగ్రాతులను పరామర్శించారు. మార్చురీ వద్ద ఉన్న మృతుల కుటుంబాలను ఓధర్చేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. ‘ప్రమాదం జరిగిన మూడు రోజుల తర్వాత వస్తారా? మీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది’ అంటూ మండిపడ్డారు. కంపెనీ ఏర్పాటుచేసి 35 ఏండ్లు అయిందని, ఐదేండ్ల క్రితం ఎలాంగోగౌడకు లీజుకు ఇచ్చామని, ప్రమాదంలో ఆయన కూడా మరణించారని చిదంబరం తెలిపారు. ప్రమాదంలో 40 మంది చనిపోయారని, 33 మంది గాయపడ్డారని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. కంపెనీ కార్యకలాపాలను 90 రోజులు నిలిపివేస్తున్నట్లు కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో పేర్కొంది. సిగాచి ఫ్యాక్టరీలో పరికరాలు కాలం చెల్లినవి కావని, పరికరాలు కొత్తవి ఉన్నాయని పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ రాజు సిన్హా తెలిపారు. బుధవారం సాయంత్రం పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. సిగాచి పరిశ్రమ వద్ద భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోపలికి ఎవరినీ అనుమతించడంలేదు.
పరిశ్రమ శిథిలాలను తొలగిస్తున్న కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. బుధవారం నాలుగు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 53కు చేరినట్టు అధికారులు ప్రకటించారు. 34 మంది క్షతగాత్రులు వేర్వేరు దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావటంలేదని తెలుస్తున్నది.
ప్రమాదం జరిగి మూడురోజులైనా తమవా రి జాడ తెలియక బాధితుల కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. కార్మికులలో ఎక్కువమం ది ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ర్టాలకు చెందినవారు ఉన్నారు. కార్మికుల కుటుంబ సభ్యులు కంపెనీ వద్ద మూడురోజులుగా కన్నీటిపర్యంతమవుతూ పడిగాపులు కాస్తున్నారు. అధికారులు వివరాలు చెప్పకపోవటంతో మహిళలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మృతదేహాల గుర్తింపులో భాగంగా పటాన్చెరు ఏరియా దవాఖానలో కార్మికుల కుటుంబ సభ్యుల డీఎన్ఏ పరీక్షల కోసం శాంపిల్స్ సేకరిస్తున్నారు.
సిగాచి పరిశ్రమలో ప్రమాదంపై ప్రభుత్వం స్పందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ఘటనపై సమగ్ర విచారణకు నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. నెలరోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనకు గల కారణాలు, పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు సూచించింది.
బండ్లగూడకు చెందిన జాస్టిన్ (20) కోసం వెతుకుతున్నాం. అతడు మా బావగారి కుమారుడు. రెండు రోజులుగా సిగాచిలో డ్యూటీకి వెళ్తున్నాడు. సోమవారం జరిగిన పేలుడులో గల్లంతయ్యాడు. అతడి సమాచారం కోసం మూడు రోజులుగా తిరుగుతున్నాం. హెల్ప్డెస్క్లోనూ పేరు రాయించాం. డీఎన్ఏ శాంపిల్స్ కూడా ఇచ్చాం. ఇంతవరకు అతడి ఆచూకీ లభిస్తలేదు. అన్ని దవాఖానలు తిరిగాం. అధికారులు మెల్లిగా శిథిలాలు తీస్తున్నారు.
నా భర్త శివాజీ కుమార్ నెల రోజులుగా ఈ కంపెనీలో డ్యూటీ చేస్తున్నాడు. సోమవారం పేలుడు సమయంలో కంపెనీలోనే ఉన్నాడు. ఆ తర్వాత అతడి అడ్రస్ లేకుండా పోయింది. అతడి కోసం దవాఖానల్లో వెతికాను. మార్చురీలోనూ శవాలను చూశాం. పోలీసులు హెల్ప్‌డెస్క్ వద్దకు పంపుతున్నారు.