సంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ): ప్రేమవివాహం చేసుకున్న దంపతులిద్దరూ సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్‌రెడ్డి ఇటీవలే మద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్యను రెండు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు సిగాచి పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఆషాఢమాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక చేసుకుందామని అనుకున్నారు. సోమవారం ఇద్దరు వేర్వేరు షిఫ్టుల్లో విధులకు వెళ్లాల్సి ఉన్నది. అనుకోకుండా ఇద్దరూ ఉదయం షిప్టు విధులకే వెళ్లారు.
ఇద్దరూ కంపెనీలోకి చేరుకున్న కొద్దిసేపటికే భారీ పేలుడు చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. శ్రీరమ్య మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. నిఖిల్‌రెడ్డి మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉన్నది. నవదంపతుల మృతితో వారి ఇండ్లతోపాటు స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సిగాచి పరిశ్రమలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న మంచిర్యాలకు చెందిన వీఆర్జీ నాగేశ్వర్రావు ప్రమాదంలో మృతి చెందాడు. త్వరగా ఇంటికి వస్తానని భార్య హేమలతకు చెప్పిన నాగేశ్వరావు, తిరిగిరాని లోకాలకు పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.