సుల్తాన్‌బజార్, అక్టోబర్ 18: గ్రూప్-4 తుది ఫలితాలు ఇవ్వక ముందే అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పలువురు అభ్యర్థులు హైదరాబాద్ గాంధీభవన్‌ను ముట్టడించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభ్యర్థులు మెట్లపై కూర్చొని నినదించారు. బ్యానర్లు, ప్లకార్డులు పట్టకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. బ్యాక్లాగ్ హటావో- గ్రూప్-4 బచావో, బ్యాక్లాగ్ తీసేయండి-గ్రూప్-4ను రక్షించండి.. అన్ని నినాదాలు మిన్నంటాయి. ఇతర ఉద్యోగాలకు ఎంపికైన వారు అన్విల్లింగ్ ఆప్షన్ పెట్టుకుంటే ఆ తర్వాత ఉన్న వారికి అవకాశం దక్కుతుందని తెలిపారు. బ్యాక్లాగ్ పోస్టులను మిగిల్చవద్దని డిమాండ్ చేశారు. 1:3 ప్రకారం ఎంపికైన గ్రూప్-4 జాబితాలోని ఎందరో అభ్యర్థులు ఎన్నో పోటీ పరీక్షల్లో పైస్థాయి ఉద్యోగాలు సాధించారని, ఇలాంటి వారు సుమారు 2,000కు మించి ఉంటారని తెలిపారు. తుది ఫలితాలు ఇవ్వకముందే వారి నుంచి అన్విల్లింగ్ ఆప్షన్ తీసుకోవాలని కోరారు. ఏండ్లుగా కష్టపడుతున్న తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ప్రక్రియను పూర్తిచేసి వెంటనే గ్రూప్-4 తుది ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.