సిద్దిపేట : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో సిద్దిపేట దశ, దిశ మారిపోయిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజా అవసరాలు ఒక్కొక్కటిగా తీర్చుతున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో గుణాత్మక మార్పులు సాధిస్తూ దేశానికే తలమానికంగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు.
సిద్దిపేట శివారు నాగులబండ వద్ద నూతనంగా నిర్మించిన హరిత త్రీ స్టార్ టూరిజం హోటల్‌ను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా జాతీయ, రాష్ట్ర స్థాయిలో 33 అవార్డులను సొంతం చేసుకున్నదని గుర్తు చేశారు. ఇవాళ ప్రారంభించుకున్న హరిత త్రీ స్టార్ హోటల్ ఉత్తర తెలంగాణ నుంచి రాకపోకలు సాగించే వారికి ఉపయోగపడుతుందన్నారు. టూరిజం హోటల్ ప్రక్కనే వందలాది మందికి ఉపాధినిచ్చే ఐటీ టవర్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి అని తెలిపారు. టూరిజం హోటల్ ముందు ఆక్సిజన్ పార్క్ 200 ఎకరాలలో విస్తరించి ఉంది. విద్య, వైద్యం రంగాలలో మౌలిక సదుపాయాలు పెంపొందిస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని దుద్దేడను అభివృద్ధి చేసుకుంటున్నాం అని మంత్రి స్పష్టం చేశారు. రూ.100 కోట్లతో రంగనాయక సాగర్‌ను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు. సిద్దిపేట ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామన్నారు. తమ పరిధిలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలను గుర్తించి సిద్దిపేట ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా దృష్టి లోపాల సవరణకు కృషి చేయాలని హరీశ్‌రావు సూచించారు.