సిద్దిపేట, జనవరి 5: సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలు బీ లావణ్య బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ వ్యవహారం విఫలమవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. జోగలాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తూ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నది. మెడికల్ కళాశాల హాస్టల్లో శనివారం ఉదయం శరీరంలోకి గడ్డి మందు (పారాక్విట్) ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. తోటి జూనియర్ డాక్టర్లు వెంటనే ఆమెను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానకు తరలించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున లావణ్య మృతి చెందింది. జనరల్ మెడిసిన్ విభాగంలో పనిచేసున్న జూనియర్ డాక్టర్ ప్రణయ్ తేజ్‌తో ప్రేమ వ్యవహారం విఫలం కావడంతో లావణ్య ఆత్మహత్యకు పాల్పడినట్టు తోటి డాక్టర్లు చర్చించుకుంటున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అల్వాల్‌కు చెందిన నిందితుడు ప్రణయ్ తేజ్‌ను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.
బీసీ హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ; నల్లగొండ జిలా ్లకేంద్రంలో ఘటన
నీలగిరి, జనవరి 5: బీసీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన నల్లగొండ జిలా ్లకేంద్రంలో జరిగింది. అనుముల మండలం హజారిగూడెంకు చెందిన ఎర్రబోయిన హేమ పట్టణంలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో ఎంపీసీఎస్ సెకండియర్ చదువుతూ శ్రీనగర్‌కాలనీలోని బీసీ బాలికల హాస్టల్లో ఉంటున్నది. సోమవారం తెల్లవారుజామున హేమ వాష్ రూముకు వెళ్లి వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తోటి విద్యార్థినులు ఆమెను వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు , తోటి విద్యార్థినులు ఆరా తీయగా వాష్‌రూమ్‌లోని యాసిడ్ తాగినట్టు చెప్పింది. మెరుగైన వైద్యసేవలందించేందుకు ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. తల్లి అనారోగ్యం, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణాలుగా భావిస్తున్నారు.
హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష ; నిజామాబాద్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
వినాయక్‌నగర్, జనవరి 5: హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ నిజామాబాద్ మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని నాగారం బ్రాహ్మణకాలనీకి చెందిన ఆటోడ్రైవర్ కండేలాల సందీప్ (28) నిరుడు ఫిబ్రవరిలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆయన భార్య లత ఐదో టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కీలక ఆధారాలు సేకరించారు. బ్రాహ్మణ కాలనీలో నివాసముండే పాత నేరస్తుడు బైరగోని సతీశ్‌గౌడ్ సందీప్‌ను ఆటోలో ఇందల్వాయి మండలం చంద్రాయణపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్టు గుర్తించారు. అక్కడ సందీప్‌కు తాటికల్లు తాగించి మత్తులోకి జారుకున్న తర్వాత రాయితో కొట్టి హత్యచేశాడు. మృతదేహాన్ని కాల్చివేసి, ఆటోతో పాటు సెల్ఫోన్లు తీసుకుని పరారయ్యాడు. పోలీసులు సతీశ్‌ను అరెస్టు చేసి, కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ్‌రెడ్డి వాదనలు వినిపించారు. అభియోగాలు రుజువు కావడంతో నిజామాబాద్ మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దుర్గాప్రసాద్ ముద్దాయికి మరణశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.