సమ్మెలో ఉన్న మీ స్పెషలాఫీసర్ జాయిన్ కాకపోయినా సరే. ఇతర సిబ్బంది వ్యక్తిగతంగా జాయిన్కావొచ్చు. ఆదివారం సాయంత్రం వరకే అవకాశం. ఆ లోపు జాయిన్‌కాని వారి జాబితాను సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు పంపిప్తాం.
-కేజీబీవీ టీచర్లకు సిద్దిపేట డీఈవో ఇచ్చిన ఆదేశాలు.
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సమ్మెలో ఉన్న ఎస్ఎస్ఏ ఉద్యోగులను పాలకుల మాదిరిగానే విద్యాశాఖ అధికారులూ బెదిరింపులకు దిగుతున్నారు. దీనికి పైన ఉన్న కొన్ని ఆధారాలే నిదర్శనం. గతంలో ఇచ్చిన హామీనే నేడు అమలు చేయలేమని, ఉద్యోగులు సమ్మె మానాలని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక ధోరణి ప్రదర్శించగా, తెగేదాక లాగితే ఉద్యోగాలు ఊడుతయ్.. అని శనివారం మంత్రి సీతక్క హెచ్చరించారు. ఆ మరునాడే ఇదే రీతిలో అధికారులు సైతం బెదిరింపులకు దిగారు. ఏకంగా టెర్మినేట్ చేస్తామని అధికారులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఉద్యోగుల్లోని ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.
సమ్మె వీగిపోయేలా కుట్రలకు పాల్పడుతున్నారు. దీంతో సమ్మె చేస్తున్న ఉద్యోగులంతా బెంబెలెత్తిపోతున్నారు. తొలుత పాఠశాల విద్యాశాఖ డెరెక్టర్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు చర్చలు జరిపారు. మంత్రుల స్థాయిలో రెండుసార్లు చర్చలు జరిపారు. అయినా ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ప్రభుత్వం నుంచి డిమాండ్లపై స్పష్టతలేకపోవడంతో ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మెను కొనసాగిస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి రెగ్యులరైజ్ చేయడం సాధ్యంకాదని, సమస్యలు పరిష్కరించలేమని చేతులేత్తేశారు. సీఎం ప్రకటన నేపథ్యంలో విద్యాశాఖ దూకుడు పెంచింది. నయానో, బయనో చెప్పి దారికి తెచ్చుకునేందుకు ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నది.
పేస్కేల్ అయినా ఇవ్వండి
రెగ్యులైజ్ చేయడం సాధ్యంకాదని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం పెద్ద దుమారం రేపింది. సీఎం వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్టయింది. ఒకవేళ ఇప్పుడు రెగ్యులరైజ్ చేయకపోతే తమ రెండో ప్రధాన డిమాండ్ అయిన పేస్కేల్‌ను అమలుచేయాలని ఎస్ఎస్ఏ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
19 వేల కుటుంబాలం రోడ్డెక్కుతం!
ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడితే 19 వేల కుటుంబాలు రోడ్డెక్కాల్సి ఉంటుందని ఎస్ఎస్ఏ ఉద్యోగ సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు కేజీబీవీల్లోని బోధనేతర సిబ్బందిని సమ్మెలోకి దించలేదని, ప్రభుత్వం ఇలాగే పట్టుదలకు పోతే నాన్ కేజీబీవీల్లోని బోధనేతర సిబ్బందిని సైతం సమ్మెలోకి దించుతామని ఆ నేతలు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులెవరూ భయపడొద్దని, తమతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం నేతలు దుండిగల్ యాదగిరి, అనిల్‌చారి, దుర్గం శ్రీనివాస్ తదితరులు పేర్కొంటున్నారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని వారు ప్రకటించారు.
సర్వశిక్ష ఉద్యోగులకు నమ్మకద్రోహం
సర్వశిక్ష ఉద్యోగులను చాయ్ తాగినంత సేపట్లో రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక వారికి నమ్మకద్రోహం చేశారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏమీ ఎరుగనట్టు సమగ్రశిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వానికి చెందనదని, నిరసనలు కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగులు నిరసనను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆదివారం ఆమె ఎక్స్ వేదికగా మద్దతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 19,600 మంది సర్వశిక్ష ఉద్యోగులు 26 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. కుటుంబాలతో సహా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నా, వారితో సీఎం, మంత్రులు చర్చించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కేజీబీవీ స్పెషలాఫీసర్ల పేరు మీదున్న బ్యాంక్ ఖాతాలను ఇన్చార్జి స్పెషలాఫీసర్ల పేరు మీదికి మార్చుతాం. ఆర్థిక అధికారాలను ఇతరులకు అప్పగిస్తాం
– కేజీబీవీ అధికారుల హెచ్చరికలు.
సమ్మె విరమించి విధుల్లో చేరండి. వస్తారా లేదా మీ ఇష్టం. విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి టెర్మినేషన్ చేస్తాం
– మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓ ఎంఈవో స్వయంగా పంపిన ఎస్ఎంఎస్.