Congress | సిద్దిపేట ప్రతినిధి/గజ్వేల్(నమస్తే తెలంగాణ),డిసెంబర్ 2: సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాపూర్‌లో కోకాకోలా కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎదుటే గజ్వేల్ కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. తన వర్గీయులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆందోళనకు దిగారు. ఆయన వర్గీయులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలను సైతం చించివేశారు. దీంతో పోలీసులు లాఠీలు ఝుళిపించి కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. కోకాకోలా కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి తొలుత హెలిప్యాడ్ ప్రదేశం వద్ద జిల్లా అధికారులు, కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌తో కలిసి కంపెనీ ప్రారంభోత్సవ వేదిక వద్దకు చేరుకోగా.. పోలీసులు తమకు అందిన జాబితా ప్రకారమే స్థానిక నేతలను ప్రారంభోత్సవ కార్యక్రమ వేదిక వద్దకు వెళ్లేందుకు అనుమతించారు.
ఈ నేపథ్యంలో పీపీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావుతోపాటు ఆయన వర్గీయులు లోపలికి వెళ్లారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తనవర్గం వారిని కూడా లోపలికి అనుమతించాలని కోరగా అందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో నర్సారెడ్డి లోపలికి వెళ్లకుండా తన వర్గీయులతో కలిసి బయటనే బైఠాయించారు. దీంతో ఆగ్రహించిన ఆయన వర్గీయులు లోపలికి వెళ్లిన బండారు శ్రీకాంత్‌రావు వర్గీయులను బయటకు రప్పించాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పినప్పటికీ వినకుండా అరగంటకుపైగా ఆందోళన కొనసాగించారు. బండారు శ్రీకాంత్రావుతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలను సైతం చించివేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. నర్సారెడ్డి వర్గీయులు రాళ్లు విసరడంతో పోలీసులు మరోసారి కార్యకర్తలను చెదరగొట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి కోకాకోలా కంపెనీ లోపల ఉండగానే ఇదంతా జరిగింది. తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన చేపడుతున్న నర్సారెడ్డితోపాటు పలువురిని లోపలికి పిలిపించుకున్నారు. దాంతో నర్సారెడ్డి వర్గీయులు ఆందోళన విరమించారు.