హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదరిపల్లి గ్రామంలోని వివాదాస్పద భూములపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని కలెక్టర్ మనుచౌదరి నిర్ణయించారు. ఈ గ్రామంలో సర్వే నంబర్ 294లోని కొన్ని బై నంబర్ల భూమి మీద వివాదం ఏర్పడిన నేపథ్యంలో సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు. భూ వివాదం, దాని స్వభావాన్ని నిర్థారించటం కోసం నలుగురు సభ్యులతో కూడిన రెవెన్యూ కమిటీ ఏర్పాటుచేశారు.
ఈ కమిటీ పూర్తిస్థాయి విచారణ జరిపి ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు గతంలో తాను ఇచ్చిన బీ1/2479/2024 ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ శనివారం ఆదేశాలు జారీచేశారు. చౌదరిపల్లి గ్రామం సర్వే నంబర్ 294లోని భూములపై 19 మంది రైతులు గతంలో కోర్టును ఆశ్రయించారు. 294/4, 294/5 సర్వే నంబర్లో సబ్ నంబర్లతో ఉన్న 19 మంది రైతులకు చెందిన దాదాపు 12 ఎకరాల 15 గుంటల భూమిపై కొందరు రైతులు గత ఏడాది సెప్టెంబర్ 13న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వారి వాదనలు విన్న హైకోర్టు.. ఆయా భూములపై విచారణ జరిపి సరైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఆ భూములపై సమగ్ర విచారణ చేశారని, స్థానిక తహసీల్దార్, ఆర్డీవో ఇచ్చిన నివేదికల ఆధారంగా 1953 నుంచి అవి పట్టా భూములే అని ఈ ఏడాది ఏప్రిల్ 21న ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఇటీవల వల్లపు బక్కయ్యతోపాటు మరి కొంతమంది రైతులు సర్వే నంబర్ 294లోని భూమిని ఎవరికీ విక్రయించలేదని, ఎవరికీ బదిలీ చేయలేదని, పట్టాలోని లోపాలు సరిదిద్ది ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని అభ్యర్థించారు.
ఈ నేపథ్యంలో బక్కయ్య, మరి కొంతమంది రైతుల అభ్యర్థన మేరకు మరోసారి సమగ్ర విచారణ జరుపాలని నిర్ణయించినట్టు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ కోసం జిల్లా రెవెన్యూ అధికారి, సిద్దిపేట ఆర్డీవో, లాండ్ రికార్డ్స్ సర్వే శాఖ ఏడీ, అక్బర్పేట్-భూంపల్లి తహసీల్దారుతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మరోసారి రైతులకు నోటీసులు ఇచ్చి, సమగ్ర విచారణ జరుపుతుందని, అంతవరకు ఈ ఏడాది ఏప్రిల్ 21న తాను జారీచేసిన బీ1/2479/2024 ఉత్తర్వులు నిలుపుదలలో ఉంటాయని పేర్కొన్నారు.
ఇదీ నేపథ్యం..
దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట్-భూంపల్లి మండలంలోని చౌదరిపల్లిలో సర్వే నంబర్ 294లో 178.05 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి 294/1 నుంచి 294/10 వరకు ఉన్న బై నంబర్లలో విస్తరించి ఉన్నది. సేత్వార్, కాస్రా పహాణీ రెవెన్యూ రికార్డుల్లో ఈ మొత్తం ప్రభుత్వ భూమిగా ఉన్నది. ఇందులో 294/1 నుంచి 294/3 వరకు ఉన్న 51 ఎకరాలు ఇప్పటికీ ప్రభుత్వ భూమిగానే ఉండగా, 294/4 నుంచి 294/10 సర్వే నంబర్లలో ఉన్న భూమి మాత్రం ప్రైవేటు పట్టాకు ఎక్కినట్టు రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి. ఆ భూమిలో అదే గ్రామానికి చెందిన కుమ్మరి, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన కొంతమంది రైతులు చాలాకాలంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.
ఈ భూములు తమ తాతల నుంచి తమకు వారసత్వంగా అసైన్డ్ పట్టా భూములుగానే వస్తున్నాయని రైతులు చెప్తున్నారు. అసైన్డ్ ల్యాండ్స్ అంటే అమ్మడానికి వీలు ఉండదు. అలా కాకుండా విక్రయిస్తే, పీవోటీ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే, ఈ భూముల్లోని 74 ఎకరాల వరకు కొంతమంది ప్రముఖ వ్యక్తులు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
ముందుగా ప్రముఖ వ్యక్తులకు చెందిన అనుచరులు రైతుల వద్దకు వెళ్లి లీజు పేరుతో వారి భూములను తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. భూమిని లీజుకు తీసుకున్న వ్యక్తులు పట్టా మార్పిడి చేసి కొంతమంది ప్రముఖ వ్యక్తులకు విక్రయించినట్టు ఇటీవల చౌదరిపల్లి గ్రామానికి చెందిన రైతులు కొందరు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లా కలెక్టర్‌కు, స్థానిక ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అదే సర్వేనంబర్‌లోని 294/4, 294/5 భూముల మీద కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.