హైదారాబాద్ మార్చి 4 (నమస్తే తెలంగాణ): పింఛన్ వస్తే ఔషధాలు తెచ్చుకోవాలని కొందరు.. పింఛన్ వస్తే అవసరాలు తీర్చుకోవాలని మరికొందరు.. ఇలా ఎందరో అభాగ్యులు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నా పింఛన్ మాత్రం రావడం లేదు. మూడు నెలలుగా సదరం సర్టిఫికెట్లు రెన్యువల్ చేయకపోవడంతో పింఛన్ అందక పరేషాన్ అవుతున్నారు. బోదకాలు, పక్షవాతం, ప్రమాదాల్లో వైకల్యానికి గురైన వందలాది మంది కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోతున్నది. ఆన్లైన్ సమస్యలను సాకుగా చూపుతూ అధికారులు తప్పించుకుంటున్నారు.
బీఆర్ఎస్ పాలనలో పేదలకు అండగా నిలువడానికి కేసీఆర్ 21 రకాల పింఛన్లు అందజేశారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు, బోదకాలు, డయాలసిస్, బీడీ టేకేదార్లు తదితర పింఛన్లు ఉన్నాయి. వీరందరికీ క్రమం తప్పకుండా ప్రతినెలా పింఛన్ అందేది. దివ్యాంగులు, బోదకాలు, పక్షవాతంతో బాధపడేవారి సదరం సర్టిఫికెట్లను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసేవారు. దీంతో ప్రతినెలా పింఛన్ రాగానే ఔషధాలు తెచ్చుకోవడంతోపాటు అవసరాలను తీర్చుకునేవాళ్లు. కానీ కాంగ్రెస్ పాలనలో కష్టాలు మొదలయ్యాయి. ఎయిడ్స్, బోదకాలు, ప్రమాదాల్లో వైకల్యానికి గురైనవాళ్లు ఇలా తదితరుల వికలాంగత్వ సర్టిఫికెట్లను రెన్యువల్ చేయడం లేదు. మూడు నెలలుగా మండల ఆఫీసులు, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని, అయినా పనికావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
వాస్తవానికి పక్షవాతం తదితర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి, ప్రమాదాల్లో వైకల్యానికి గురైన వారికి వైకల్య తీవ్రతను బట్టి మూడేండ్లు, ఐదేండ్ల కాలపరిమితితో సదరం సర్టిఫికెట్లను ప్రభుత్వం జారీ చేస్తుంది. గడువు ముగిసిన తర్వాత తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించి అర్హత ఉన్నవారికి మళ్లీ సర్టిఫికెట్లు ఇస్తుంది. ఈ ప్రక్రియ జాప్యం లేకుండా వెంటవెంటనే రెన్యువల్ జరిగిపోయేది. యథావిధిగా ప్రతినెలా పింఛన్ అందేది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరం సర్టిఫికెట్ల రెన్యువల్లో జాప్యం జరుగుతున్నది. దీంతో బాధితులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులకు విన్నవిస్తే సర్వర్ పని చేయడం లేదని, ఆన్లైన్లో సమస్యలున్నాయని చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల దివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడీ కార్డును జారీ చేస్తున్నది. తెలంగాణలో మాత్రం సదరం సర్టిఫికెట్లను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. కేంద్ర ప్రమాణాలు, రాష్ట్ర విధానాలకు పొం తన కుదరడం లేదు. ఈ కారణంగా సదరం సర్టిఫికెట్ల రెన్యువల్ ప్రక్రియను నిలిపివేశారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ విధానాల పేరుతో తమను వేధించడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.