నల్లబెల్లి/అశ్వారావుపేట, జూలై 7 : కుల వివక్ష, ఉన్నతాధికారులు, సిబ్బంది వేధింపులకు ఓ ఎస్సై బలయ్యాడు. ఎన్నోరోజులుగా ఎదురవుతున్న అవమానాలు భరించలేక జూన్ 30న పురుగుల మందుతాగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్, హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. కిందిస్థాయి సిబ్బంది, ఉన్నతాధికారుల నుంచి తాను ఎదుర్కొన్న వేధింపులను మరణవాంగ్మూలంలో వివరించగా ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, సిబ్బందితోపాటు సీఐ జితేందర్‌రెడ్డి వేధింపుల వల్లే తన భర్త శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని, బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని శ్రీనివాస్ భార్య కృష్ణవేణితో పాటు కుటుంబసభ్యులు స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో జాతీయ రహదారిపై బైఠాయించి సుమారు మూడు గంటల పాటు రాస్తారోకో చేశారు.
కృష్ణవేణి తెలిపిన వివరాల ప్రకారం.. నారక్కపేటకు చెందిన శ్రీరాముల శ్రీనివాస్ (38), 2014లో ఎస్సై ఉద్యోగం పొందాడు. ప్రస్తుతం అశ్వారావుపేటలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్ని రోజులుగా సీఐ జితేందర్‌రెడ్డి నేతృత్వంలో అదే పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కొంతమంది సిబ్బంది ఎస్సై శ్రీనివాస్‌ను వేధింపులకు గురి చేస్తుండడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెంది జూన్ 30న మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో పురుగుల మందు తాగగా హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో చేర్పించారు.
వారంపాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన శ్రీనివాస్, ఆదివారం తెల్లవారుజామున చనిపోయాడు. తన భర్త ఆత్మహత్యకు సీఐ, కానిస్టేబుళ్ల వేధింపులే కారణమని కృష్ణవేణి హైదరాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, జీరో ఎఫ్ఐఆర్ (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు) నమోదు చేసి తదుపరి విచారణకు కేసును మహబూబాబాద్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు సీఐ జితేందర్‌రెడ్డిని ఐజీ కార్యాలయానికి, నలుగురు కానిస్టేబుళ్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
ఎస్సై శ్రీనివాస్ మృతదేహాన్ని స్వగ్రామం నారక్కపల్లికి తీసుకొచ్చి కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాదాపు మూడు గంటల పాటు జాతీయరహదారిపై బైఠాయించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌చేశారు. బాధితురాలికి అండగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాస్తారోకోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కులవివక్ష, వేధింపుల కారణంగా ఓ పోలీస్ అధికారే ఆత్మహత్య చేసుకుంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏమిటని దళిత సంఘాల నాయకులు ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెంటనే రాజీనామా చేయాలని పెద్ద పెట్టున నినదించారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. ఎంతో కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగం సాధించిన నారక్కపేటకు చెందిన దళిత బిడ్డ శ్రీనివాస్ ఉన్నతాధికారుల వేధింపులకు బలికావడం కలిచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. చట్టాన్ని రక్షించే పోలీస్‌కే రక్షణ లేదంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని చెప్పారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దళితుడై ఉండి దళిత పోలీస్ అధికారి గురించి పట్టించుకోలేదంటే ఆయనకు దళితులపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లమైందని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ స్పందించి ఎస్సై శ్రీనివాస్ మృతికి కారకులైన సీఐ, పోలీస్సిబ్బందిపై విచారణ చేపట్టి తక్షణమే వారిని అరెస్ట్ చేసి ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని, మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సై మృతి బాధ్యులను శిక్షించాలని అశ్వారావుపేటలోనూ దళితసంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
నారక్కపేటలో ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజ్ చేరకొని అక్కడే ఎస్సై శ్రీనివాస్ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితోపాటు మృతుడి భార్య, కుటుంబసభ్యులతో చర్చలు జరిపారు. మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఎక్స్‌గ్రేషియా అందేలా చర్యలు తీసుకుంటామని, మృతికి కారకులైనవారిని తక్షణమే అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించి, అంత్యక్రియలు చేపట్టారు.
ఎస్సై ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎస్సై కుటుంబానికి రూ.కోటి పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఉన్నతాధికారుల వేధింపులతో ఓ ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ సైకో పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. వేధింపులపై ఫిర్యాదు చేసినా కనీసం విచారణ జరపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి దళిత ఎస్సై మృతికి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హత్యలు, ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయని అసహనం వెలిబుచ్చారు. శ్రీనివాస్ కుటుంబానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సానుభూతి ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేశారు.
నర్సంపేట రూరల్, జూలై 7 : ఎస్సై శ్రీనివాస్ మరణ వార్త విని అతడి మేనత్త దార రాజమ్మ(65) గుండెపోటుతో ఆదివారం మృతిచెందింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన రాజమ్మ తన మేనల్లుడు చనిపోయాడని తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఆమెకు భర్త ఐలయ్య, ఇద్దరు కుమారులున్నారు. ఒకే రోజు ఇద్దరి మృతితో వారి కుటుంబంలో తీరని విషాదం అలుముకున్నది. ఆమె కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది పరామర్శించారు.
‘స్టేషన్ల ఆంధ్ర కానిస్టేబుళ్లు సన్యాసి నాయుడు, శేఖర్, సుభాని, ఇంకో ఇద్దరు శివనాగరాజు, ఉమెన్ పీసీ నాగలక్ష్మి సిస్టం వర్క్ చేస్తరు. రికార్డులు రాస్తరు. వాళ్లువాళ్లు గొడవ పెట్టుకొని కావాలని నా వర్క్ అపిండ్రు. ఎందుకాపిండ్రనడిగితే ‘మేమిట్లనే జేస్తం.. నువ్వెవ్వన్నన్న పెట్టుకో.. మేం జెయ్యం’ అని బ్లాక్మెయిల్ చేసిండ్రు. సర్లే అని వేరేవాళ్లను పెట్టుకొని పనిచేయిస్తుంటే ‘మేం జెయ్యం ఇంకొకరిని చెయ్యనియ్యం’ అని హరాస్మెంట్ చేసిండ్రు. సీఐగారికి చెప్తే ఆయన నన్నే హరాస్మెంట్ జేసిండు. ఈ విషయాలన్నీ డీఎస్పీకి రిపోర్ట్ పెట్టినా పట్టించుకోలే. చెప్పుకోవద్దుగని వాళ్లంతా రెడ్డీస్ కద. వాళ్ల డామినేటే ఉంటది.
వాళ్లదగ్గరికి పోయినా కూడా కూర్చోమనకపోవడం, నిలవెట్టిచ్చి మాట్లాడడం చేసేది. ఈ విషయాలన్నీ ఎస్పీకి రిపోర్ట్ పెట్టి 25 రోజులైనా యాక్షన్ లేదు. సీఐ చిన్నచిన్నవాటికి కావాలని మెమోస్ ఇస్తుండె. క్లోజెస్ పంపిస్తే చిన్నచిన్న కారణాలతో రిటర్న్ పంపుతుండె. ఎన్నిసార్ల మస్టర్చేసి పంపినా చిన్నచిన్న రిమార్క్స్ పెడుతూ రిటర్న్ చేస్తుండె. వీళ్లు కావాలనే నన్ను హరాస్మెంట్ చేస్తున్నరని అర్థమై ట్రాన్స్‌ఫర్‌కు ప్రయత్నాలు చేసిన. ఈ డిలేలో హరాస్మెంట్ ఎక్కువైంది. ఆంధ్రా కానిస్టేబుళ్లు తిరగబడగడం, మర్యాద ఇవ్వకపోవడం ఇలా చెప్పకుంటూ పోతే చానా ఉన్నయ్..’
– మరణ వాంగ్మూలంలో ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్