వెల్దండ, జూన్ 26 : రూ.50 వేలు లంచం తీసుకుంటూ నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ ఎస్సై ఏసీబీ అధికారులకు దొరికాడు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ కథనం మేరకు.. కల్వకుర్తికి చెందిన వెంకటేశ్ ఈ నెల 17న పేలుడు పదార్థాలతో పోలీసులకు దొరికాడు. వెల్దండ ఎస్సై రవి సదరు వ్యక్తిని కేసు నమోదు చేయొద్దంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇచ్చేందుకు ఎస్సైకి ఫోన్ చేయగా.. కల్వకుర్తిలో 108 అంబులెన్స్ డ్రైవర్ విక్రమ్‌కు అందించాలని సూచించాడు. మంగళవారం రాత్రి 11 గంటలకు వెంకటేశ్ నుంచి విక్రమ్ రూ.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్సై రవిని బుధవారం నాంపల్లి ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లినట్టు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు.