హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): మైనారిటీ గురుకుల సొసైటీలో అక్రమాల వెనక ముఖ్యనేత అనుచరుడు చక్రం తిప్పుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. లేని ఉద్యోగుల పేరిట నిధుల గోల్మాల్ వెనక ఆయనదే కీలకపాత్ర అని తెలుస్తున్నది. అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై విచారణ చేపట్టకుండా, విషయాలేవీ బయటకు పొక్కకుండా పలుకుబడిని ఉపయోగించి తొక్కిపెడుతున్నారని సొసైటీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. అక్రమాలపై నోరు విప్పుతున్న ఉద్యోగులను వదిలిపెట్టేది లేదంటూ తమ అనుకూల ఉద్యోగులతో సొసైటీ గ్రూపులో తాజాగా మెసేజ్‌లు పెట్టించడం సొసైటీలోని దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నది. మైనారిటీ గురుకుల సొసైటీ పరిధిలో 205 గురుకులాలు ఉన్నాయి. ఆయా గురుకులాల్లో సొసైటీ ఇష్టారీతిన నియామకాలు చేపడుతూ, లేని పోస్టులను చూపుతూ నిధుల స్వాహాకు పాల్పడుతున్నదని సొసైటీ వర్గాలే ఆరోపిస్తున్నాయి.
ఇతర సొసైటీల్లో కుక్‌లు, వర్కర్లు, స్వీపర్లు, జూనియర్ అసిస్టెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టులను కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తున్నారు. గురుకులాల్లో టీచింగ్ స్టాఫ్ అంటే జూనియర్ లెక్చరర్, పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ , ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ తదితర పోస్టులను జిల్లాలవారీగా కలెక్టర్ల ద్వారా ఆయా సొసైటీలే డెమోలను నిర్వహించి భర్తీ చేసుకుంటున్నాయి. కానీ, ఒక్క మైనారిటీ సొసైటీలో మాత్రం అందుకు పూర్తివిరుద్ధం. కలెక్టర్లతో ప్రమేయం లేకుండానే జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్, సొసైటీ అధికారులే ఏజేన్సీలను ఖరారు చేసి టీచింగ్ సిబ్బందిని ఎంపిక చేస్తారు. ప్రధాన కార్యాలయం సిబ్బంది తుది ఎంపికను పూర్తి చేస్తుంది. హెడ్ ఆఫీస్‌లోని పలువురు ఉద్యోగులు, ఏజెన్సీలు కుమ్మక్కై ఈ నియామకాల్లో భారీ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
పోస్టులు 32.. ఉద్యోగులు 122 మంది!
మైనార్టీ సొసైటీ బైలా ప్రకారం.. ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా 35 పోస్టులు మాత్రమే ఉండాలి. కానీ, ప్రస్తుతం ఏకంగా 122 మంది ఉన్నారు. విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్, షూస్, స్టేషనరీ తదితర అన్నిరకాల టెండర్లలోనూ కాంట్రాక్టు సంస్థలతో సొసైటీలోని పలువురు ప్రైవేట్ వ్యక్తులు కుమ్మక్కయ్యారని సొసైటీ వర్గాలే కోడై కూస్తున్నాయి. సొసైటీ ఆర్థిక వ్యవహారాలపై గత మూడేండ్లుగా ఆడిట్ కూడా లేదని తెలుస్తున్నది. సొసైటీలో ఉద్యోగులే కాదు లేని విద్యార్థుల పేరిట కూడా నిధులను స్వాహా చేస్తున్నారని తెలుస్తున్నది. మైనార్టీ గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియను సొసైటీనే సొంతంగా నిర్వహిస్తుంది. విద్యార్థుల వివరాల్లో తప్పుడు లెక్కలను చూపుతున్నారని సమాచారం. అందుకోసం సొసైటీలోని ఉన్నతాధికారులు కిందిస్థాయి ప్రిన్సిపాల్స్పై ఒత్తిడి చేస్తున్నారని ఉద్యోగవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే, ప్రభుత్వ అనుమతి పొందకుండానే ప్రైవేట్ వ్యక్తులను విజిలెన్స్ విభాగం బృందాలుగా ఏర్పాటు చేసి ప్రిన్సిపాల్స్‌ను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మాటవినని ప్రిన్సిపాల్స్ బాధ్యులుగా ఉన్న గురుకులాలను ఈ ప్రైవేట్ విజిలెన్స్ బృందాలు సందర్శించి తప్పుడు రిపోర్టులను సమర్పిస్తామని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు బాధిత ప్రిన్సిపాల్స్ చెప్తున్నారు.
చక్రం తిప్పుతున్న మైనారిటీ నేత
ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సదరు మైనారిటీ నాయకుడు.. సొసైటీ సెక్రటరీ, ఉన్నతాధికారులతో సంబంధం లేకుండానే నేరుగా ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీచేస్తున్నారని బాధిత ప్రిన్సిపాల్స్, సొసైటీ ఉద్యోగులు చెప్తున్నారు. పలువురు ఉన్నతాధికారులు, సదరు నాయకుడు మిలాఖత్ అయ్యి అక్రమాలకు తెరలేపారని ఆరోపిస్తున్నారు.
ఏజెన్సీలతో కుమ్మక్కై, ఇష్టారీతిన నచ్చినవారిని సొసైటీలో నియమిస్తున్నారని, నిధులను పక్కదారి పట్టిస్తున్నారని వివరిస్తున్నారు. సదరు నాయకుడు చేస్తున్న అక్రమాలను పసిగట్టిన ఒక సెక్రటరీ వాటన్నింటినీ చెక్ పెడుతూ వచ్చారు. హెడ్ ఆఫీస్‌లోని ప్రైవేట్ వ్యక్తులను, అదనపు సిబ్బందిని పూర్తిగా తొలగించారు. పలు ఏజెన్సీలను పూర్తిగా రద్దు చేశారు. జిల్లాస్థాయిలోనూ ప్రక్షాళన చేపట్టారు. దీంతో సదరు మైనారిటీ నాయకుడు సీఎంవో స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి సదరు సెక్రటరీని సొసైటీ బాధ్యతల నుంచి తప్పించారని ఉద్యోగవర్గాలు వివరిస్తున్నాయి. ప్రస్తుత సెక్రటరీ వచ్చిన తర్వాత మళ్లీ గతంలో మాదిరిగానే అన్నింటినీ పునరుద్ధరించడం గమనార్హం. అంతేకాదు, మైనారిటీ గురుకులాల్లో ఏటా అడ్మిషన్ల ప్రచారం కోసం ఎక్కడికక్కడ స్థానికంగా ఆయా ప్రిన్సిపాల్స్‌కే నిధులు ఇచ్చేవారు.
ఈ ఏడాది ఆ నిధులను ఇవ్వలేదు. కేవలం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనే ప్రచార స్టాల్‌ను ఏర్పాటుచేసినట్టు తెలుస్తున్నది. దాదాపు రూ.40 లక్షలు ఖర్చు పెట్టి మతపెద్దలతో ప్రముఖ హోటల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వాటి పేరిట లక్షల రూపాయలు స్వాహా చేసినట్టు తెలుస్తున్నది. తీరా అడ్మిషన్లు కాలేదని చెప్తూ ఏకంగా 170 మంది ప్రిన్సిపాల్స్‌కు షోకాజ్ నోటీసులను ఇవ్వడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారం వెనక కూడా సదరు మైనారిటీ నాయకుడే చక్రం తిప్పినట్టు తెలుస్తున్నది. సొసైటీలో అక్రమాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి, ప్రభుత్వ పెద్దలకు ఉద్యోగులు, సమాచార హక్కు కార్యకర్తలు అనేకసార్లు ఫిర్యాదు చేశారు. కానీ, వాటిపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. సదరు మైనారిటీ నాయకుడు సీఎంవో స్థాయిలో ఒత్తిడి తెచ్చి విచారణలు కొనసాగకుండా అడ్డకుంటున్నారని సొసైటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.