కాశీబుగ్గ, జూలై 6 : వరంగల్ ఎంజీఎం దవాఖానను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పలు విభాగాల్లో తిరుగుతూ పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. 40 మంది వైద్యులు విధులకు డుమ్మా కొట్టినట్టు గుర్తించి, వెంటనే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లల వార్డుకు సంబంధించిన ఓ వైద్యుడు ఏకంగా జూలై నెల మొత్తానికి రిజిస్టర్లో సంతకాలు పెట్టినట్టు గుర్తించిన కలెక్టర్ అతడిని సస్పెండ్ చేయాలని సిఫారసు చేశారు.
సిబ్బంది పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె సూపరింటెండెంట్ మండిపడ్డారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యాధికారులు విధులను నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదని హెచ్చరించారు. ఆమె వెంట డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో కృష్ణవేణి తదితరులు ఉన్నారు.