హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అనుమతినిచ్చే విషయమై తీసుకునే నిర్ణయాన్ని వెల్లడించాలని పేర్కొంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీచేసింది. బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ సభకు ఏర్పాట్లు చేసుకోవడానికి తగిన సమయం కావాలి కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ రజతోత్సవాలను పురస్కరించుకొని హనుమకొండ జిల్లా ఎలతుర్తిలో భారీ బహిరంగ సభ, వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలతుర్తి గ్రామంలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు అనుమతి కోరుతూ మార్చి 28, ఈ నెల 4న ఇచ్చిన వినతి పత్రాలపై వరంగల్ కమిషనర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాస్యం వినయ్‌భాసర్ పిటిషన్‌పై జస్టిస్ టీ వినోద్‌కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఎలతుర్తిలోని 1,300 ఎకరాల్లో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భూమి యజమానుల నుంచి అంగీకార పత్రాలను కూడా బీఆర్ఎస్ తీసుకున్నదని చెప్పారు. ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సభ, వేడుకలు జరుగనున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొననున్నారని వివరించారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోలీసులు అనుమతి ఇచ్చే విషయంపై స్పందించడం లేదని, అందుకే హైకోర్టుకు రావాల్సివచ్చిందని చెప్పారు. చివరి సమయంలో అనుమతికి నిరాకరిస్తే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ కష్టతరం అవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిందని, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా పేరుమారిందని వివరించారు. హనుమకొండకు 13 కిలోమీటర్ల దూరంలోని ఎలతుర్తిలో 1300 ఎకరాల స్థలంలో లక్షల మంది బీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించే సభకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని, ఇలాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ముందుగా పోలీసులు అనుమతి ఇవ్వకుండా కావాలని ఇబ్బందులకు గురిచేయడం దారుణమని అన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం రాజ్యాంగంలోని 19(1)(బి) అధికరణానికి వ్యతిరేకమని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ, భారీ ఎత్తున బీఆర్ఎస్ నిర్వహించే సభకు అనుమతి ఇచ్చే విషయంలో పోలీసులు పరిశీలన చేయాల్సి వుందని అన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికతోపాటు పారింగ్, శాంతిభద్రతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే అనుమతి ఇవ్వాల్సి వుంటుందని చెప్పారు. పిటిషనర్ సమర్పించిన వినతిపత్రంపై నగర పోలీసు కమిషనర్ మరికొన్ని వివరణలు, పత్రాలు కోరారని చెప్పారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. వీటికి పిటిషనర్ గురువారం రాత్రే సమాధానం ఇచ్చారని, కౌంటర్ దాఖలు చేయడానికి మరింత గడువు కావాలని కోరారు. దీనిపై హెకోర్టు అభ్యంతరం తెలిపింది. బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ సభకు ఏర్పాట్లు చేసుకోవడానికి తగిన సమయం కావాలి కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శాంతిభద్రతల సమస్య, ఇంటెలిజెన్స్ రిపోర్టును పరిగణనలోకి తీసుకొని అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన వివరాలు సేకరించడానికి సమయం పడుతుందని న్యాయవాది చెప్పారు. విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేయాలని కోరగా, అందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 17వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్టు తెలిపింది. ఈ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులైన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వరంగల్ పోలీస్ కమిషనర్, కాజీపేట ఏసీపీలకు నోటీసులు జారీచేసింది.