హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తున్నదని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారమిస్తే సేవాలాల్ ఆలయాలు నిర్మిస్తామని బీజేపీ నేతలు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రస్తుతం 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నదని, అందులో ఏ రాష్ట్రంలోనైనా సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారా? గుడులు కట్టించారా? నిధులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. బీజేపీ మోసపూరిత మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని, తరిమికొట్టేవరకు తెచ్చుకోవద్దని సూచించారు. సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన ఉత్సవాలు, బోగ్ బండార్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. దేశంలో సంత్ సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగా ణ అని గుర్తుచేశారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ.. దేశంలో 744 గిరిజన తెగలున్నాయని, మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తే వీరంతా ఒక్కచోట కలుసుకొనే అవకాశం లభిస్తుందని చెప్పారు.