హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఫార్మా కంపెనీ ఘటనలో అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసిన యువకులు, రైతులను వెంటనే విడుదల చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ డిమాండ్ చేశారు. తమ భూములు లాక్కోవద్దని రైతులు ఎంత వేడుకున్నా ప్రభుత్వం కనికరించడం లేదని తెలిపారు.
అధికారులను సైతం బతిమాలిన వినకపోవడంతోనే రైతులు ఆగ్రహించాల్సి వచ్చిందని వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో లంబాడీలపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పచ్చని పొలాల్లో ఫార్మా చిచ్చు పెట్టొద్దని, కంపెనీ ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని రాంబాల్ నాయక్ సూచించారు.