హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరి నాట్లు జోరందుకున్న సమయంలో డీఏపీ ఎరువుకు కొరత ఏర్పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో డీఏపీ కొరత ఉన్నట్టు వ్యవసాయ శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ నుంచి జూలై వరకు కేంద్రం నుంచి 1.90 లక్షల టన్నుల డీఏపీ రాష్ర్టానికి సరఫరా కావాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు 43 వేల టన్నుల డీఏపీ మాత్రమే వచ్చినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో డీఏపీ కొరతను తీర్చేందుకు ఈ నెలలో 80 వేల టన్నులు సరఫరా చేయాలని ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు. దీంతో రాష్ర్టానికి అవసరమైన డీఏపీతోపాటు అన్ని ఎరువులను సరఫరా చేస్తామని మంగళవారం ఆయన హామీ ఇచ్చినట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు. కానీ, ఆ ఎరువులను ఎప్పటిలోగా సరఫరా చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోవడంతో రాష్ట్రంలో డీఏపీ కొరత మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాస్తవానికి ఈ వానకాలం సీజన్ కోసం రాష్ర్టానికి కేంద్రం 24.40 లక్షల టన్నుల ఎరువులను (10.40 లక్షల టన్నుల యూరియా, 10 లక్షల టన్నున ఎన్పీకే, 2.40 లక్షల టన్నుల డీఏపీని) కేటాయించింది. దీనిలో భాగంగా ఏప్రిల్లో 50 వేల టన్నులు, మే నెలలో 60 వేల టన్నులు, జూన్లో 50 వేల టన్నులు, జూలైలో 30 వేల టన్నుల చొప్పున ఇప్పటివరకు మొత్తం 1.90 లక్షల టన్నుల డీఏపీ సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 43 వేల టన్నులే వచ్చినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
రాష్ర్టానికి అవసరమైన ఎరువులు కేటాయిస్తామని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ రాశారు. రాష్ర్టానికి సరిపడా ఎరువులను కేటాయించడం లేదంటూ జూన్ 19న కేంద్రానికి మంత్రి లేఖ రాశారు. ఏప్రిల్, మే నెలలో 1.12 లక్షల టన్నుల డీఏపీ అవసరం ఉండగా 43వేల టన్నులు మాత్రమే సరఫరా చేశారని, జూలైలో 80వేల టన్నులు సరఫరా చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి తిరిగి లేఖ రాశారు. డీఏపీతో పాటు ఇతర ఎరువులనూ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.